దాదాపు పదేళ్లుగా అధికారంలో ఉంటున్న ఒక పార్టీ.. ఇంకా ఎన్నికలకు షెడ్యూల్ అయినా విడుదల కాకముందే.. అభ్యర్థుల జాబితాను ప్రకటించడం అంటే మాటలేమీ కాదు. అది కూడా.. ఏవో నాలుగు నియోజకవర్గాల్లో తప్ప దాదాపు అభ్యర్థులెవరనేది ప్రకటించారు.
ఇంకా ఎన్నికలెప్పుడనే పూర్తి స్పష్టత లేకపోయినా ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసురుతూ కేసీఆర్ తన పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు! మరి కేసీఆర్ ను గద్దెదించుతామంటున్న కాంగ్రెస్, బీజేపీలు ఏం చేస్తున్నాయో కానీ.. కేసీఆర్ మాత్రం తగ్గేదేలా అన్నట్టుగా అభ్యర్థుల జాబితాను అనౌన్స్ చేశారు.
అసలే పదేళ్ల టీఆర్ఎస్ పాలనపై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ప్రబలిందనే విశ్లేషణలున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత అనేది తెలంగాణలో చాలా వేగంగా పెరుగుతుందని ఉమ్మడి ఏపీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించినా తెలుస్తుంది. అయితే కేసీఆర్ కు గత ఎన్నికల్లో చంద్రబాబు రూపంలో పెద్ద సహకారం లభించింది. టీఆర్ఎస్ సంచలన విజయం సాధించింది. మరి ఈ సారి రెండు పర్యాయాల వ్యతిరేకతనూ ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ముందుగా అభ్యర్థులను ప్రకటించేయడం అంటే.. కేసీఆర్ కు విజయంపై గట్టి ధీమా ఉందనేందుకు ఇంతకన్నా రుజువు అక్కర్లేదు!
అది కూడా అరకొర మినహాయిస్తే దాదాపు సిట్టింగులకే టికెట్ కేటాయించి కేసీఆర్ పెద్ద పరీక్షనే పెట్టుకున్నారు కూడా! పదేళ్ల పాలన తర్వాత కనీసం కొత్త మొహాలను చూపించి ఓటు అడగడం ఒక పద్ధతి. అయితే కేసీఆర్ మాత్రం అలాంటి వ్యూహాల జోలికి వెళ్లలేదు. దాదాపు సిట్టింగులకే సీట్లను కేటాయించారు. అంటే టీఆర్ఎస్ కు ఓటేస్తే.. అదే ఎమ్మెల్యేలు, అదే ముఖ్యమంత్రి, అదే పార్టీ ఉంటుంది తప్ప మసి పూసే ప్రయత్నం ఏదీ లేదని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అది కూడా ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాకముందే కేసీఆర్ పూర్తి స్పష్టత ఇచ్చారు.
మరి ఏదేమైనా.. మారేదేమీ లేదని ముందుగానే అభ్యర్థులను ప్రకటించేసి కాంగ్రెస్, బీజేపీలకు కేసీఆర్ సవాల్ విసిరారు. మరి ఎన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలు ఉన్నారో కూడా స్పష్టత లేని బీజేపీ, ఒక్కో నియోజకవర్గంలో టికెట్ మాకే అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకునే స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ఎప్పటికి ప్రకటిస్తాయో!