తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి అభ్యర్తుల జాబితాను ప్రకటించిన అధికార టీఆర్ఎస్ పార్టీ రెడ్డి సామాజికవర్గానికి పెద్ద పీట వేసింది! ఎంతలా అంటే.. 119 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే.. అందులో ఏకంగా 40 మంది రెడ్లున్నారు! అంటే మొత్తం అభ్యర్థుల జాబితాలో మూడో వంతు స్థానాల్లో రెడ్లు పోటీలో ఉన్నట్టే టీఆర్ఎస్ తరఫున!
ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో రిజర్వ్డ్ స్థానాల్లో కాస్త వేరే పేర్లు కనిపిస్తున్నాయి కానీ మిగతా సీట్లలో రెడ్లకే టికెట్ లు అన్నట్టుగా ఉంది టీఆర్ఎస్ జాబితా. పటాన్ చెరులో గూడెం మహిపాల్ రెడ్డితో టీఆర్ఎస్ జాబితాను మొదలుపెడితే, మేడ్చల్ లో మల్లారెడ్డి బరిలో ఉన్నారు. దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉప్పల్ లో బండారు లక్ష్మారెడ్డి, ఇబ్రహ్మీం పట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎల్బీనగర్ లో సుధీర్ రెడ్డి, మహేశ్వరంలో సబితా, పరిగి కొప్పుల మహేశ్ రెడ్డి, తాండూర్ లో రోహిత్ రెడ్డి, మలక్ పేట తీగల అజిత్ రెడ్డి, వీటితో పాటు చాంద్రాయన్ గుట్టా, యాకూత్ పురా సీట్లను కూడా రెడ్లకే కేటాయించింది టీఆర్ఎస్. కొడంగల్, నారాయణ్ పేట్, జడ్చర్ల, దేవరకద్రా, మక్తల్, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, హుజూర్ నగర్, సూర్యాపేట, నల్లగొండ, మునుగోడు, భువనగిరి, నర్సంపేట, భూపాల్ పల్లి, పాలేరు, నిర్మల్, మంథల్, ఆర్మూర్, బాన్సువాడా, బాల్కొండ, పెద్దపల్లి, హుజూరాబాద్, మెదక్, నారాయణ్ ఖేడ్.. ఇలా దాదాపు 40 నియోజకవర్గాల్లో రెడ్డి అభ్యర్థులు టీఆర్ఎస్ తరఫున పోటీపడబోతున్నారు.
ఇక టీఆర్ఎస్ తరఫున ఖరారు కావాల్సిన మిగిలిన సీట్లలో రెండు సీట్లలో గనుక రెడ్డి అభ్యర్థులు బరిలోకి దిగితే.. ఈ సంఖ్య 42కు చేరే అవకాశం ఉంది. కేసీఆర్ పాలనపై తెలంగాణ రెడ్లలో వ్యతిరేకత ఉందనే విశ్లేషణల నేపథ్యంలో.. గత స్థాయికి తీసిపోని విధంగా ఏకంగా మూడో వంతు సీట్లను కేసీఆర్ పార్టీ రెడ్లకే కేటాయించింది.
ఇక ఈ సీట్లలో కాంగ్రెస్ తరఫున కూడా వందకు వంద శాతం రెడ్లే బరిలోకి దిగే అవకాశాలు ఉండటం కొసమెరుపు. కాంగ్రెస్ జాబితాలో రెడ్ల సంఖ్య టీఆర్ఎస్ కు మించి ఈ సారి కనీసం 50 వరకూ చేరినా పెద్ద ఆశ్చర్యం లేదు. బీజేపీ కూడా ఇంతకు తగ్గకుండానే రెడ్లకు టికెట్ల చదివింపులు చేసే అవకాశం ఉంది.