భావప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు కదా అని విచ్చలవిడిగా మాట్లాడితే కుదరదు. మన హక్కు ఎప్పుడు గాని, మరొకరి వ్యక్తిగత స్వేచ్ఛలోకి చొరబడకుండా ఉన్నంతవరకే హక్కుగా ఉంటుంది. భావ ప్రకటన ప్రాథమిక హక్కు అయితే, దానికి సంబంధించిన ప్రాథమిక సత్యం ఇది. హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు ఈ సత్యాలను కూడా తెలుసుకోవాలి. లేకుంటే కటకటాల పాలయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది.
పాత రోజుల్లో పరిస్థితి వేరు. ఒక విషయం మీద అ ఒక అభిప్రాయం చెప్పాలని అనే వ్యక్తి.. ఏదో ఒకటి దగ్గరో, రచ్చబండ మీద కూర్చుని చర్చ మొదలు పెట్టేవాళ్ళు. నలుగురి మధ్య అభిప్రాయాలు, విభేదాలు, వాదోపవాదాలు నడిచేవి. అంతకుమించి ఆ గొడవ ఊరువాడా దాటి బయటకు కూడా వెళ్ళేదికాదు. అక్కడితో సమసిపోయేది. సద్దుమణిగి పోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.
సోషల్ మీడియా పుణ్యమా అని స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ తమ తమ అభిప్రాయాలను ఇవాళ్టి రోజుల్లో యావత్ ప్రపంచానికి సులువుగా తెలియ చెప్పగలుగుతున్నారు. ఇంటి నుంచి బయటకు కదలవలసిన అవసరం లేదు. మీ బాత్ రూమ్ లో కూర్చుని కూడా, నిమిషాల వ్యవధిలో మీ అభిప్రాయాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేయవచ్చు. ఇది సాంకేతికత అందించిన సౌలభ్యం.
అంత సులువుగా మారిపోయింది కనుకనే.. ప్రతి ఒక్కరూ విచ్చలవిడిగా అభిప్రాయాలు చెప్పేస్తున్నారు. చాలామంది చిక్కుల్లో పడుతున్నారు. అభిప్రాయాలు ఎవరు చెప్పినా పర్వాలేదు, తప్పుకాదు. కానీ వారి మాటలు గీతదాటితే మాత్రం చిక్కులు తప్పవు. ప్రభుత్వాధినేతల మీద హేయమైన భాషలో దుడుకు కామెంట్లు చేయడం చాలామందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి దుష్పరిణామాలు కేవలం ఇప్పుడు మాత్రమే పుట్టినవి కాదు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నరోజుల్లో కూడా, అనుచిత వ్యాఖ్యలతో చాలామంది కటకటాల పాలయ్యారు.
ఇప్పుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా అలాంటివి అనేకం రిపీట్ అవుతున్నాయి. పైగా ఇప్పుడు సాంకేతికత మరింత విస్తరించింది. ఆకాశరామన్న ఏదో ఒకటి బయటి ప్రపంచంలోకి వదిలేసి, గుట్టుచప్పుడు కాకుండా ఉంటే కుదరదు. మూల కర్తలను వెతికి పట్టుకోవడం పోలీసులకు చిటికెలో పనిగా మారింది.
మొన్నటికి మొన్న కృష్ణా వరదల సమయంలో.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను అసభ్యంగా దూషించడం ద్వారా తెలుగుదేశం కార్యకర్త అరెస్టు అయ్యారు. ఇది తిట్ల వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేయడం ద్వారా బయటకు వచ్చింది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కూడా జగన్ ను తిట్టి, ఆ వీడియోను వాట్సప్ లో సర్కులేట్ చేసినందుకు ఐదుగురు వ్యక్తులు అరెస్టు అయ్యారు.
ముందు ముందు ఇలాంటి సంఘటనలు చాలా మామూలుగా అయిపోవచ్చు. అత్యుత్సాహంతో రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ.. నేతలను అసభ్యంగా నిందించే వాళ్లకు ఇలాంటి అరెస్టులు హెచ్చరిక. తన మాటలు గీత దాటకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహిస్తే మంచిది.