ఏపీ హై కోర్టును రాయలసీమలో ఏర్పరచాలని అంటూ ఆ ప్రాంత వాసులు ముందు నుంచినే కోరుతూ ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈ డిమాండ్ తెర మీదకు వచ్చింది. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. సీమాంధ్ర సహిత ఆంధ్రప్రదేశ్ లో శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధానే రాయలసీమకు చెందాలి. అయితే కనీసం హై కోర్టు అడిగినా చంద్రబాబు నాయుడు స్పందించలేదు.
అప్పట్లో రాయలసీమలో చంద్రబాబునాయుడు ఎక్కడ పర్యటించాలన్నా… లాయర్లను, హైకోర్టు సీమకు కావాలనే పోరాటకారులను అరెస్టు చేసేవారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులూ అలాంటి వ్యవహారమే నడిచింది.
అయితే రాజధాని విషయంలో వికేంద్రీకరణ అని అంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం హై కోర్టును రాయలసీమకు అప్పగించేలా కనిపిస్తూ ఉన్నారు. ఈ మేరకు జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదే దెబ్బతో అటు వికేంద్రీకరణ మంత్రాన్ని అమల్లో పెట్టడంతో పాటు, రాయలసీమ చిరకాల వాంఛను కూడా తీర్చిన ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
విజయవాడ సమీపంలో ఏర్పరిచిన తాత్కాలిక హై కోర్టు తమకు అనుకూలంగా లేదని ఇప్పటికే న్యాయవాదులు, న్యాయమూర్తులు కంప్లైంట్స్ చేస్తున్నారు. అక్కడకు వెళ్లి రావడం కూడా కష్టంగా ఉందని వారు అంటున్నారట. ఈ నేపథ్యంలో హై కోర్టు కర్నూలుకో, తిరుపతికో చేరడం ఖాయంగా కనిపిస్తోంది!