వెండి తెరకే కాదు బుల్లితెరకు కూడా హీరోయిన్లు ఉన్నారండోయ్. వెండితెర హీరోయిన్లనైనా గుర్తు పట్టలేరేమో కానీ, బుల్లితెర హీరోయిన్లని మాత్రం మహిళలు వెంటనే క్యాచ్ చేస్తారు. ఎందుకంటే డైలీ సీరియల్స్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.
బుల్లితెర హీరోయిన్‌గా మహిళల విశేష ఆదరణ పొందిన నవ్యసామి వైరస్ బారిన పడినట్టు విశ్వసనీయ సమాచారం. ‘నా పేరు మీనాక్షి’ , ‘ఆమె కథ’ సీరియల్స్ లో హీరోయిన్‌గా మరీ ముఖ్యంగా తెలుగు మహిళా ప్రేక్షకులను ఈ హీరోయిన్ అలరిస్తున్నారు. కొన్నిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఈమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు సమాచారం. దీంతో నవ్యసామి ఎవరెవరిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నారు.
లాక్‌డౌన్ కారణంగా మార్చి చివరి వారం నుంచి అన్ని రకాల షూటింగ్‌లు బంద్ అయ్యాయి. ఇటీవల లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా తెలంగాణ సర్కార్ షూటింగ్‌లకు కొన్ని నిబంధనలకు లోబడి అనుమతి ఇచ్చింది. దీంతో బుల్లితెర, వెండితెరకు సంబంధించి షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్టు బుల్లితెర నటుడు ప్రభాకర్ కరోనా బారిన పడ్డాడు. ఇతని కాంటాక్ట్‌లో ఉన్న మరో బుల్లితెర నటుడు హరికృష్ణ కూడా కరోనా బాధితుడయ్యాడు. వెంటనే అతను పాల్గొనే షూటింగ్స్‌ను రద్దు చేశారు. తాజాగా బుల్లితెర హీరోయిన్ కూడా కరోనా బారిన పడడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఇలాగైతే షూటింగ్స్ జరుపుకోవడం ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది.