నటి, దర్శకురాలైన లక్ష్మీ రామకృష్ణన్‌కు మరో నటి , మూడో పెళ్లితో వార్తల్లో వ్యక్తిగా నిలిచిన వనితా విజయ్‌కుమార్ ఫైర్ అయ్యారు. తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అసలేం జరిగిందంటే…
నటి వనిత జీవితంలో పెళ్లిళ్లు కలిసి రాలేదు. రెండు పెళ్లిళ్లు వివిధ కారణాలతో విడాకులకు దారి తీశాయి. ఇటీవలే పీటర్ పాల్ అనే వ్యక్తిని ఆమె మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే తనకు విడాకులు ఇవ్వకుండానే వనితను పెళ్లి చేసుకున్నాడని పీటర్ మొదటి భార్య ఎలిజబెత్ హెలెన్ పోలీసులకు అదేరోజు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వనిత పెళ్లిపై మరోసారి చర్చకు తెర లేపింది.
ఈ నేపథ్యంలో నటి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్ స్పందించారు. పీటర్ పాల్ మరో పెళ్లి చేసుకునే వరకు ఆయన మొదటి భార్య ఫిర్యాదు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అంతేకాదు, ఇప్పుడు డబ్బు కోసమే ఆమె ఫిర్యాదు చేసిందని లక్ష్మీ రామకృష్ణన్ ట్వీట్ చేశారు. వనిత చాలా కష్టాల్లో ఉన్నారని, ఈ బంధం అయినా ఆమె నిలుపుకుంటారని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు.
లక్ష్మీ రామకృష్ణన్ ట్వీట్ వివాదానికి దారి తీసింది. దర్శకురాలి ట్వీట్‌పై వనిత విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శకురాలికి వనితా ఘాటుగా సమాధానమిచ్చారు.
‘భార్యాభర్తలు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారో మీకు తెలుసా? తెలియని విషయంపై ఆసక్తి చూపించాల్సిన అవసరం మీకు లేదు. నేను ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడంలేదు. కాబట్టి, మీరు ఈ విషయంలో తలదూర్చటం ఆపేయాలి. మీకు తెలియని ఒక వ్యక్తి గురించి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తెలిసో తెలియకో ఈ వ్యవహారంలో చిక్కుకున్నా. ఎలా సరిదిద్దుకోవాలో నాకు తెలుసు ’ అని వనిత స్పష్టం చేశారు.