ప్రస్తుత కరోనా సంక్షోభ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందు చాలా సమస్యలున్నాయి. కరోనాతోపాటు చైనా నుంచి దాడులు, నేపాల్ లేవనెత్తిన సరిహద్దు సమస్య, పాక్ నుంచి ఉగ్రవాద ముప్పు … ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. ఈ సమస్యల్లో ఓ కొత్త సమస్య చేరింది. అయితే ఇది కరోనా మాదిరిగానో, చైనా, పాకిస్తాన్ మాదిరిగానో దేశానికి నష్టం కలిగించేది కాదు.
ఇది రాజ్యాంగానికి సంబంధించింది. మరోమాటలో చెప్పాలంటే ఓ కీలక రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించింది. దీన్ని గురించి సీరియస్ గా ఆలోచించాల్సిన సమయం కేంద్రానికి వచ్చింది. ఇంతకూ ఏమిటి ఇంతటి సీరియస్ విషయం. రాష్ట్రాల్లో శాసన మండలి గురించి. ఏపీలో టీడీపీ లేవనెత్తిన ఈ అంశం గురించి తప్పక ఆలోచించాల్సిందే. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల్లో శాసన మండలి శాశ్వత సభ కాదు. దీన్ని ఎప్పుడంటే అప్పుడు సినిమా సెట్టింగు మాదిరిగా పీకి అవతల పారేయొచ్చు. అవసరం అనుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు.
రాజ్యాంగం ఈ వెసులుబాటు కల్పించింది. రాజ్యాంగం రూపొందించిన పెద్దలు మంచి ఉద్దేశంతోనే ఎగువ సభను అంటే శాసన మండలిని పెట్టారు. కేంద్రంలో అంటే పార్లమెంటులో ఎగువ సభగా రాజ్యసభను పెట్టారు. కేంద్రంలో అయినా, రాష్ట్రాల్లో అయినా ఎగువ సభను పెద్దల సభ అంటారని తెలుసు కదా. పార్లమెంటులో దిగువ సభ అంటే లోక్ సభ. రాష్ట్రాల్లో అయితే శాసన సభ. దిగువ సభకు ఎన్నికలు జరుగుతాయి.
ప్రజాప్రతినిధులు ఎన్నికవుతారు. అసలు పరిపాలన చేసేది వీళ్ళే. శాసనాలు చేసేది వీళ్ళే. ఈ సభలోనూ మేధావులు ఉంటారు. రౌడీలు ఉంటారు. నేరగాళ్లు ఉంటారు. ప్రభుత్వం చేసే చట్టాలన్నీ అద్భుతంగా ఉండవు కదా. అనేక లోపాలుంటాయి. అందుకని వాటిని చెక్ చేసి సలహాలు ఇవ్వడానికి మేధావులు, నిపుణులతో కూడిన ఎగువ సభను పెట్టారు. కాలక్రమంలో ఎగువ సభ భ్రష్టు పట్టిపోయింది. ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది.
సాధారణంగా ఎగువ సభలో ప్రతిపక్షాలదే ఆధిపత్యంగా ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు అధికారంలో ఉండేది వాళ్ళే కాబట్టి. కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వానికి ఎగువ సభలో చికాకు కలుగుతుంది. దిగువ సభలో ఆమెదం పొందిన బిల్లులు ఎగువ సభలో ఆమోదం పొందవు. దీంతో బిల్లుల ఆమోదంలో జాప్యం జరుగుతుంది. ఇక్కడే రాజకీయ రచ్చ మొదలవుతుంది. ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి కూడా రాజకీయ రచ్చ జరిగింది. దిగువ సభలో ఆమోదం పొందిన బిల్లు ఎగువ సభలో ఆమోదం పొందలేదు కదా.
మండలి చైర్మన్ దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపారు. దీంతో సీఎం జగన్ కు ఒళ్ళు మండింది. కోపం నషాళానికి అంటింది. వెంటనే మండలిని రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఇప్పటికి ఆరు నెలలైంది. తీర్మానం కేంద్రానికి పంపిన కొన్ని రోజులకే కరోనా మొదలైంది. పార్లమెంటు సమావేశాలు లేవు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు ఎలా నిర్వహించాలనేదానిపై కేంద్రం తల బద్దలు కొట్టుకుంటోంది.
వర్చువల్ సమావేశాల గురించి ఆలోచిస్తోంది. కేంద్రానికి ఇప్పుడున్న అనేకానేక సమస్యలలో మండలి సమస్యకు ప్రాముఖ్యం లేదనే చెప్పాలి. ఈలోగా టీడీపీకి ఓ ఆలోచన వచ్చింది. రాజ్యసభ మాదిరిగా రాష్ట్రాల్లో మండలిని పర్మనెంట్ బాడీగా ఉంచాలని, పాలకుల ఆగ్రహానికి బలి కాకుండా చూడాలని కేంద్రానికి మెమోరాండం సమర్పించింది. ఈ ప్రతిపాదనపై కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మండలిని ఫుట్ బాల్ మాదిరిగా ఆడుకోవడం అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది
ఒక ప్రభుత్వం రద్దు చేస్తే, మరో ప్రభుత్వం పునరుద్ధరించడం ఆనవాయితీగా మారింది. దేశం మొత్తం మీద మండలిని రద్దు చేసిన మొదటి రాష్ట్రం ఏపీనే. ఎన్ టీ ఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు మండలిలో కాంగ్రెస్ పార్టీదే మెజారిటీ. దీంతో ఆయన దాన్ని రద్దుచేసి పారేశారు. అప్పుడు రద్దైన మండలి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు మళ్ళీ ఏర్పాటైంది. ఇప్పుడు ఆయన కొడుకు జగన్ రద్దు చేశారు. ప్రస్తుతం టీడీపీ ప్రతిపాదనపై కేంద్రం ఆలోచిస్తోంది కాబట్టి మండలి తప్పనిసరిగా రద్దవుతుందని చెప్పలేము.
కేంద్రం వద్ద కొన్ని రద్దు ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే మండలి పునరుద్ధరణ ప్రతిపాదనలూ ఉన్నాయి. మండలిపై రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఇవ్వడమా? ఫుట్ బాల్ మాదిరిగా ఆడుకోకుండా పర్మనెంట్ బాడీగా ఉంచడమా ? ఏదో ఒకటి నిర్ణయించాల్సిన సమయం వచ్చింది.