తెలుగుదేశం పార్టీలో నాయుడి గారి కష్టాలు తప్ప, రెడ్డి గారి కష్టాలు పట్టవా? రెడ్డి నాయకులు కేవలం కరివేపాకులేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఏపీలో రాజకీయ పరిణామాలను లోతుగా అధ్యయనం చేస్తే ఈ అభిప్రాయం మరింత బలపడుతుంది. దీనికి తాజా ఉదాహరణ…మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఇచ్చిన ప్రాధాన్యం, మరో కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి సొంత పార్టీ ఇవ్వక పోవడమే.
అచ్చెన్నాయుడి పేరు చివర్లో నాయుడు ఉన్నప్పటికీ ఆయన కమ్మ సామాజిక వర్గం కాదు. ఆయన బీసీ. కానీ అచ్చెన్నా యుడి దుందుడుకు స్వభావం, బాడీ లాంగ్వేజ్, పార్టీలో ఆయన ప్రాధాన్యాన్ని చూసి మెజార్టీ ప్రజలు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతగానే అచ్చెన్నాయుడిని గుర్తిస్తారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ అనంతరం టీడీపీ శ్రేణులు బీసీ కార్డ్ తెరపైకి తెచ్చే వరకు జనానికి ఆయన బీసీ అనే విషయం పెద్దగా తెలియదు.
ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడి అరెస్ట్ అయిన మరుసటి రోజే వాహనాల కుంభకోణంలో అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తండ్రీకొడుకులు కడప సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ఇటీవల తండ్రీకొడుకులకు పోలీస్ కస్టడీ కూడా ముగిసింది.
అచ్చెన్నాయుడితో పోల్చుకుంటే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు పది శాతం కూడా ప్రేమ కనబరచడం లేదు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడిని అరెస్ట్ చేసిన తర్వాత కడప జైల్లో పరామర్శించేందుకు టీడీపీ యువనేత నారా లోకేశ్ ప్రయత్నించారు. అయితే జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో తాడిపత్రి వెళ్లి జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు పవన్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులను లోకేశ్ పరామర్శించారు.
ఆ తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డి గురించి ఏ ఒక్క టీడీపీ నాయకుడు మాట్లాడిన పాపాన పోలేదు. చివరికి అనంతపురం టీడీపీ నేతలు వారిని పరామర్శించినట్టు కూడా ఎక్కడా మీడియాలో చిన్న వార్త కూడా రాకపోవడం గమనార్హం. ఇదే అచ్చెన్నాయుడి విషయానికి వస్తే చంద్రబాబు మొదలుకుని ద్వితీయ, తృతీయ శ్రేణులు చాలా ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తోంది. టీడీపీ ఆందోళన ఏ స్థాయిలో ఉందో ఆ పార్టీ పత్రిక ఈనాడులో రెండురోజులుగా వస్తున్న వార్తలను పరిశీలిద్దాం.
‘అచ్చెన్నాయుడి అరెస్ట్ అక్రమం’ శీర్షికతో మంగళవారం పత్రికలో వెబ్‌లో పదో పేజీలో ఓ వార్త ప్రచురితమైంది. ఈ వార్తను ఒకసారి పరిశీలిస్తే…‘గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, తదితరులు వచ్చారు. వీరంతా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్‌బాబును ఆయన కార్యాలయంలో కలిశారు. అచ్చెన్నాయుడి షుగర్ స్థాయిలు తగ్గుతున్నాయని, బీపీ ఉందని, ఆహారం సరిగా తీసుకోలేదని డాక్టర్ సుధాకర్ వారితో చెప్పారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ శస్త్ర చికిత్స జరిగి రోజు కూడా గడవకనే ప్రభుత్వం అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసిందన్నారు’
అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై టీడీపీ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అచ్చెన్నాయుడి వైద్య సేవలను పర్యవేక్షించేందుకు నలుగురు వైద్యులతో కమిటీ కూడా ఏర్పాటు చేసింది. బుధవారం ఈనాడులో అదే పేజీలో ‘అచ్చెన్నా యుడిపై కక్ష సాధింపే’ శీర్షికతో ఓ వార్త. టీడీపీ నేతలు రామ్మోహన్నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపణలకు సంబంధించిన వివరాలు.
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై కేసులు వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ఎలాగైనా ఆయన్ని జైల్లో పెట్టాలనేదే ప్రభుత్వ ద్యేయమని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో అచ్చెన్న ఆరోగ్యం, ఆయనకు అందుతున్న వైద్య సేవల గురించి ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆచార్య యశోధర, ఇతర వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రామ్మోహన్‌నాయుడితో పాటు మాజీ మంత్రి దేవినేవి ఉమమహేశ్వరరావు ఉన్నారు.
మరి కడప సెంట్రల్ జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడిని టీడీపీ ఎందుకు పట్టించుకోవడం లేదనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆయన ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం వల్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్‌పై టీడీపీలో అందరికంటే ఎక్కువగా జేసీ బ్రదర్స్ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డే నోరు పారేసుకున్నారు. టీడీపీ పాలనలో జగన్‌ను పచ్చి బూతులు తిట్టడంలో జేసీ బ్రదర్స్ మొదటి స్థానంలో నిలిచారు. నాడు జగన్‌ను తిట్టించడానికి అదే సామాజిక వర్గానికి చెందిన జేసీ బ్రదర్స్‌ను ముందు పెట్టిన చంద్రబాబునాయుడు…ప్రస్తుతం అవసరం తీరడంతో ఏ మాత్రం పట్టించుకోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తమను కరివేపాకులా చంద్రబాబు వాడుకున్నాడని జేసీ దివాకర్‌రెడ్డి తన అనుచరుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది. అచ్చెన్నాయుడిని పట్టించుకుంటున్నట్టుగా, తమ నాయకుడి విషయంలో టీడీపీ అధిష్టానం వ్యవహరించడం లేదని జేసీ వర్గం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికైనా జేసీ బ్రదర్స్‌కు జ్ఞానోదయమై మసలుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.