శివాజీరాజా స్ట్రాంగ్ వార్నింగ్‌

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) బిల్డింగ్ అమ్మ‌కం విష‌య‌మై మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఈ సంద‌ర్భంగా శివాజీ రాజా, న‌రేశ్‌ల‌ను టార్గెట్ చేస్తూ కొంద‌రు మాట్లాడారు. ఇదే సంద‌ర్భంలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)…

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) బిల్డింగ్ అమ్మ‌కం విష‌య‌మై మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఈ సంద‌ర్భంగా శివాజీ రాజా, న‌రేశ్‌ల‌ను టార్గెట్ చేస్తూ కొంద‌రు మాట్లాడారు. ఇదే సంద‌ర్భంలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) మాజీ అధ్య‌క్షుడు, బిల్డింగ్ అమ్మ‌కానికి కీల‌క సూత్ర‌ధారి అయిన శివాజీరాజా సున్నితంగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వ‌డం సంచ‌ల‌నం రేపుతోంది.

త్వ‌ర‌లో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో టాలీవుడ్‌లో వ‌ర్గాలు ఏర్ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో అసోసియేషన్‌ బిల్డింగ్ త‌క్కువ ధ‌ర‌కే అమ్మారంటూ విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు సార‌థ్యంలో గత నెలలో నిర్వ‌హించిన‌ జూమ్‌ మీటింగ్‌లో మోహన్‌బాబు మాట్లాడుతూ..  ‘అధిక మొత్తంతో ‘మా’ భవనాన్ని కొనుగోలు చేసి అతి తక్కువ ధరకే ఎందుకు అమ్మేశారు? సినిమా పెద్దలు అప్పుడు ఎందుకని పెదవి విప్పలేదు?’ అని నిల‌దీశారు.

ఎందుకో గానీ ఆల‌స్యంగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఇవాళ స్పందించారు. ‘బిల్డింగ్‌ కొనుగోలు చేసిన సమయంలో నేనే అధ్యక్షుడిని.  రూ.71.73 లక్షలతో కొన్నాం. ఇంటిరీయర్‌ డిజైన్‌ కోసం మరో రూ.3 లక్షలు ఖ‌ర్చు చేశాం. 2006-08 వరకు నేను అధ్యక్షుడిగా ఉన్నాను. 2008లో అధ్యక్ష పీఠం నుంచి దిగిన తర్వాత ‘మా’ వ్యవహరాల్లో ప్రత్యక్షంగా భాగస్వామిని కాలేదు. ‘మా’ అభివృద్ధికి కావాల్సిన సలహాలు మాత్రమే ఇచ్చాను. బిల్డింగ్‌ అమ్మకం వ్యవహరమంతా నరేశ్ ‌- శివాజీ రాజాలకే తెలుసు. 

శివాజీరాజా అధ్యక్షుడిగా నరేశ్‌ కార్యదర్శిగా ఉన్నప్పుడే బిల్డింగ్‌ బేరం పెట్టి రూ.30 లక్షలకే దాన్ని అమ్మేశారు. కాబట్టి ‘అతి తక్కువ ధరకు బిల్డింగ్‌ ఎందుకు అమ్మేశారు?’ అని నరేశ్‌ని అడగండి. నేను కూడా అదే విషయంపై నరేశ్‌ని ప్రశ్నిస్తాను. బిల్డింగ్‌ అమ్మకంపై మళ్లీ నాపై వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తాను’  అని నాగబాబు తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించ‌డం సంచ‌ల‌న‌మైంది.

ఈ నేప‌థ్యంలో శివాజీరాజా స్పందించారు. ఒక చాన‌ల్‌తో ఆయ‌న మాట్లాడుతూ అస‌లేం జ‌రిగిందో, అలాగే త‌మ‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై సున్నితంగానే గ‌ట్టిగా వార్నింగ్ ఇవ్వ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. శివాజీరాజా ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే…

‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌లో బంగ్లా కొన్నారు, అమ్మేశారు అని మాట్లాడుకుంటున్నారు. అది త‌ప్పు. అది బంగ్లా కాదు, పెంట్ హౌస్‌. డ‌బుల్ బెడ్‌రూమ్ హౌస్‌. దాంట్లోనే డైరెక్ట‌ర్స్‌ అసోసియేష‌న్‌, రైట‌ర్స్ అసోసియేష‌న్ కూడా ఉన్నాయి. గౌర‌వ‌మైన రెండు అసోసియేష‌న్లు కూడా ఉన్నాయి కాబ‌ట్టి నాగ‌బాబు గారు మ‌న‌కి అందులోనే ఉంటే బాగుంటుంద‌న్నారు. దీంతో పైన ప్లాట్‌ను  కొన్నాం. ఆయ‌న ఎంత నిజాయితీగా కొన్నారో, నేను ప్రెసిడెంట్‌గా, న‌రేశ్ సెక్ర‌ట‌రీగా ఉన్న‌ప్పుడు అంతే నిజాయితీగా అమ్మాం,

ఆ ప్రాప‌ర్టీలో రెంట్లు రావ‌డం లేదు. అది సింగ‌ల్ వాల్ కావ‌డంతో అమ్మేస్తే బాగుంటుంద‌ని ముర‌ళీమోహ‌న్  కూడా అన్నారు. మ‌న‌మైనా అమ్మేద్దాం… పైగా కింద మురుగు కాలువ ఉంది. ఆర్టిస్టుల‌కు ఇబ్బందిగా ఉంటుంద‌ని ఆలోచించాం. ఈసీ క‌మిటీలో అంద‌రి నిర్ణ‌యం మేర‌కు అమ్మాం. అది అమ్మేసినందుకు మా ముందు ప్రెసిడెంట్లు కూడా మ‌మ్మ‌ల్ని మెచ్చుకున్నారు. 

ఎవ‌రైనా బిల్డింగ్ అమ్మ‌కం గురించి మాట్లాడాల‌నుకుంటే ముందు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ కార్యాల‌యానికి వెళ్లి అక్క‌డ నిజాలు తెలుసుకోవాలి. అప్పుడు మాట్లాడితే నేను సంతోషిస్తాను. నేను మాట్లాడిన దాంట్లో త‌ప్పుంటే ఎవ‌రైనా వ‌చ్చి న‌న్ను అడ‌గొచ్చు. మా ఎన్నిక‌ల ముంగిట ఇలాంటి విష‌యాల మీద మాట్లాడ్డం ఎవ‌రికైనా అంత గౌర‌వంగా ఉండ‌దు’ అని శివాజీరాజా త‌న‌దైన శైలిలో చెప్పుకొచ్చారు.

ఇక శివాజీరాజా ఎవ‌రి గురించి మాట్లాడార‌నే విష‌య‌మై టాలీవుడ్‌లో, సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఎవ‌రైతే ప‌దేప‌దే బిల్డింగ్ గురించి ప్ర‌స్తావిస్తూ కొంద‌రిని టార్గెట్ చేయాల‌నే ఎత్తుగ‌డ వేశారో, వారికి శివాజీరాజా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొత్తానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు… ఆ అసోసియేష‌న్‌లోని లుక‌లుక‌ల‌ను బ‌య‌ట పెడుతున్నాయ‌నేది వాస్త‌వం.