వైసీపీ ఎమ్మెల్సీ క‌న్నుమూత‌

వైసీపీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు చ‌ల్లా భ‌గీర‌థ‌రెడ్డి (46) ఇవాళ అనారోగ్యంతో క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా న్యుమోనియాతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌కు ఆరోగ్యం విష‌మించ‌డంతో కుటుంబ స‌భ్యులు హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. ప‌రిస్థితి విష‌మించి తుదిశ్వాస…

వైసీపీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు చ‌ల్లా భ‌గీర‌థ‌రెడ్డి (46) ఇవాళ అనారోగ్యంతో క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా న్యుమోనియాతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌కు ఆరోగ్యం విష‌మించ‌డంతో కుటుంబ స‌భ్యులు హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. ప‌రిస్థితి విష‌మించి తుదిశ్వాస విడిచారు.

క‌ర్నూలు జిల్లాలో చ‌ల్లా కుటుంబానికి చెప్పుకోద‌గ్గ ప‌లుకుబ‌డి వుంది. భ‌గీర‌థ‌రెడ్డి తండ్రి దివంగ‌త చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి. చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా, సాహిత్య‌కారుడిగా సుప‌రిచితులు. ఆయ‌న మూడో సంతానం భ‌గీర‌థ‌రెడ్డి. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి ఎంఏ పొలిటిక‌ల్ సైన్స్ చ‌దివారు. రాజ‌కీయాల‌పై చిన్న‌ప్ప‌టి నుంచి ఆస‌క్తి క‌న‌బ‌రిచారు.

2003 నుంచి 2009 వ‌ర‌కూ క‌ర్నూలు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. రాజ‌కీయాల్లో తండ్రికి చేదోడుగా వుంటూ వ‌చ్చారు. 2019లో తండ్రి చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డితో పాటు వైసీపీలో చేరారు. తండ్రి మ‌ర‌ణానంత‌రం ఆయ‌న కుటుంబానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అండ‌గా నిలిచారు.

2021లో ఎమ్మెల్యే కోటాలో భ‌గీర‌థ‌రెడ్డిని ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. న్యుమోనియా రూపంలో ఆయ‌న్ను మృత్యువు వెంటాడింది. భ‌గీర‌థ‌రెడ్డి మృతికి వైసీపీ నేత‌లు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. అవుకులో గురువారం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు.