‘విజువల్ ఇంపాక్ట్’

కంటితో చూసింది బాగుంది అనిపిస్తే మెదడులో ఒక ముద్ర పడిపోతుంది. ఆ ముద్ర అలా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అప్పుడప్పుడూ మస్తిష్కంలోనుండి ముఖచిత్రంగా వచ్చి “తీపి గుర్తు” అనే భావం కలిగిస్తుంది. కొన్ని చేదు గుర్తులు…

కంటితో చూసింది బాగుంది అనిపిస్తే మెదడులో ఒక ముద్ర పడిపోతుంది. ఆ ముద్ర అలా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అప్పుడప్పుడూ మస్తిష్కంలోనుండి ముఖచిత్రంగా వచ్చి “తీపి గుర్తు” అనే భావం కలిగిస్తుంది. కొన్ని చేదు గుర్తులు కూడా మనం చెరిపేసుకోకపోతే అలాగే నిలిచిపోతాయి. 

“ఇది బాగుంది”, అని కానీ “ఇది బాగా లేదు” అని కానీ అనిపించాలంటే అదొక మనసును కదిలించే సుందర దృశ్యం కానీ, మనసును వికలం చేసే వికృత దృశ్యం కానీ అయి ఉండాలి. ఆలాంటి భావన కల్పించడాన్నే “విజువల్ ఇంపాక్ట్” అంటాం. 

రాష్ట్రం విడిపోయిన తర్వాత “అమరావతి” పేరుతో గొప్ప “విజువల్ ఇంపాక్ట్” కలిగించేలా చేశారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. నూతన రాష్ట్రం. హైదరాబాద్ నగరాన్ని కోల్పోయిన రాష్ట్రం. అవకాశాలు కోల్పోయిన రాష్ట్రం. నిరుత్సాహంతో నిండి ఉన్న ప్రజల్లో  ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించిన “అమరావతి విజువల్ ఇంపాక్ట్” అద్భుతంగా పనిచేసింది. 

అమరావతి రూపం (సింగపూర్ అనో, జపాన్ అనో అది ఎన్నిసార్లు మారినా) తెలుగు ప్రజల మస్తిష్కాల్లో చెరగని ముద్రగా పడిపోయింది.  అందుకే ఆ పేరు చెప్పినా, ఆ ప్రాంతం చూసినా అప్పటి పరిస్థితులు సృష్టించిన “డిజిటల్ ఇంపాక్ట్”  తద్వారా కలిగిన  “విజువల్ ఇంపాక్ట్” ఎందరినో కదిలించేస్తుంది. 

అలా మస్తిష్కాల్లో నిలిచిపోయే ఒక “విజువల్ ఇంపాక్ట్” ఇదిగో ఈ రూపంలో కనిపిస్తోంది. వెయ్యికి పైగా అంబులెన్సు వాహనాలు 13 జిల్లాల్లో, 676 మండలాల్లో  రోడ్లపై తిరుగుతూ ఉంటే  ప్రజల్లో  “ఇంపాక్ట్” తో పాటు ఒక భరోసా కూడా కలుగుతుంది. 

పాలకులు చెపుతున్నట్టు 20 నిమిషాల్లోనే ఈ అంబులెన్సు రాకపోయినా, అందులో పనిచేసే బృందం పాలకులు చెప్పినంత గొప్ప సేవలు అందించకున్నా,  “అంబులెన్సు వస్తుంది” అని ఇవి కల్పించే, కలిగించే భరోసా గొప్పది. అది కలిగించే ధైర్యం గొప్పది. ఆ భరోసా, ఆ ధైర్యం వల్ల కలిగే ఉపశమనం ఆరోగ్యాన్ని మెరుగుపర్చుతుంది. 

ఈ వాహనం రోడ్లపై తిరుగుతుంటే, ప్రత్యేకించి గ్రామాల్లో, మరీ ముఖ్యంగా రోడ్ల సదుపాయాలు కూడా లేని విసిరేయబడిన ప్రాంతాల్లో ఇవి తిరుగుతుంటే కలిగే భరోసా ఆ ప్రజల్లో పెద్ద ఎత్తున “హెల్తి ఇంపాక్ట్” కలిగిస్తుంది.

Written By Gopi Dora