నవరత్నాల్లో ఇదే అసలు స్పీడ్ బ్రేకర్

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ.. గతంలో చాలా ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలే చేశాయి కానీ.. తొలిసారిగా ఉన్న ఊరికి దగ్గరలోనే పేదలందరికీ శాశ్వతంగా భూమి హక్కుని బదలాయించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మాత్రం…

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ.. గతంలో చాలా ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలే చేశాయి కానీ.. తొలిసారిగా ఉన్న ఊరికి దగ్గరలోనే పేదలందరికీ శాశ్వతంగా భూమి హక్కుని బదలాయించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మాత్రం సీఎం జగన్ ఒక్కరే. నవరత్నాల హామీల అమలులో భాగంగా.. ఈ ఏడాది ఉగాది నాటికే పట్టాల పంపిణీ పూర్తికావాల్సి ఉన్నా.. కరోనా వల్ల అనివార్యంగా ఈనెల 8కి ఆ కార్యక్రమం వాయిదా పడింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించాలనేది ప్రతిపాదన. తొలిదశలో 15లక్షల మందికి.. స్థలాలు అందించబోతున్నారు. దీనికోసం 43,141ఎకరాల భూమి సిద్ధం చేశారు. అయితే పట్టాల పంపిణీ తేదీ దగ్గరపడుతున్నా.. చాలోచోట్ల వివాదాలు పరిష్కారం కావడం లేదు. పేదలకు పంపిణీ చేయాల్సిన స్థలాల్లో ఆక్రమణలు తొలగించడానికి అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల 20, 30 ఏళ్ల నుంచి అవి ఆక్రమణలో ఉండిపోవడం, అలా ఆక్యుపై చేసుకున్నవారు కూడా ఎస్సీ, ఎస్టీలు కావడంతో అధికారులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి.

నెల్లూరు, ప్రకాశం సహా రాయలసీమ జిల్లాల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఆక్రమణలు తొలగించడానికి అధికారులు వస్తున్న సందర్భంలో ఆత్మహత్య చేసుకుంటామంటూ కొంతమంది బెదిరిస్తున్నారు. ఓవైపు ఇళ్ల పట్టాల పంపిణీ సమయం దగ్గరపడుతుండే సరికి ఈ పేచీలు మరీ ఎక్కువయ్యాయి. కొన్నిచోట్ల ప్రతిపక్షాల ప్రోద్బలం కూడా ఉందనేది వాస్తవం. ఇలా ఒకరిని చూసి మరొకరు గతంలో ప్రభుత్వానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చేసినవారు కూడా తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.

అటు లబ్ధిదారుల ఎంపికపై కూడా వివాదాలు ముసురుకుంటున్నాయి. టీడీపీ బలంగా ఉన్న కొన్ని గ్రామాల్లో సచివాలయ అధికారులకు తిప్పలు తప్పడం లేదు. కొంతమంది అనర్హులు కూడా అనవసర రాద్ధాంతానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకూ నవరత్నాల కార్యక్రమంలో పేదలకు అందిన సాయం వేలల్లో ఉంది. అది కూడా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది, పొరపాటున ఎవరికైనా సాయం అందకపోతే, వెంటనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే ఇంటి స్థలాల పంపిణీ మిగతా పథకాల కంటే ఎక్కువ లబ్ధి చేకూర్చేది కావడంతో.. ప్రజలంతా దీనిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.

అటు ప్రభుత్వ భూ సేకరణతో స్థలాలు కోల్పోతున్నవారు కూడా ఆందోళనలకు సిద్ధమయ్యారు. దీంతో ఎక్కడికక్కడ రెవెన్యూ, పోలీస్ అధికారులకు తలనొప్పులు తప్పడం లేదు. ఈ గండం గట్టెక్కితే నవరత్నాల అమలులో జగన్ ఓ స్పీడ్ బ్రేకర్ ని సాఫీగా దాటినట్టే. ఉన్నది వారం రోజులే. ఈ తక్కువ రోజుల్లో ఎన్ని ఎక్కువ సమస్యలు పరిష్కారమైతే ప్రభుత్వానికి అంత మంచిది. లేదంటే ఈ పథకం అమలులో స్పీడ్ బ్రేకర్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.

లాక్‌డౌన్ కట్టుబాట్లను దేశమంతా పాటించాలి

బెజవాడలో కనీ వినీ ఎరుగని దృశ్యం