నిఖిల్ వెయిట్ చేయలేదు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ హీరో బాటలోనే నితిన్ కూడా ఉన్నాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లోనే పెళ్లికి రెడీ అయిపోతున్నాడు. ఈనెల 26న తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ షాలినిని పెళ్లాడబోతున్నాడు నితిన్.
ఏప్రిల్ లో దుబాయ్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు నితిన్. పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశాడు. అంతలోనే కరోనా వల్ల లాక్ డౌన్ పడ్డంతో పెళ్లి వాయిదా పడింది. 2 నెలలు ఆగి పరిస్థితులు చక్కబడిన తర్వాత గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా కనిపించడం లేదు. అందుకే హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌజ్ లో పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు నితిన్.
8 ఏళ్లుగా నితిన్-షాలినీ ప్రేమించుకుంటున్నారు. భీష్మ సినిమా రిలీజ్ టైమ్ లో తన ప్రేమ సంగతి బయటపెట్టాడు ఈ హీరో. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెతో నిశ్చితార్థం కూడా కానిచ్చేశాడు. ఈ నెలలో వివాహబంధంతో వీళ్లిద్దరూ ఒక్కటి కాబోతున్నారు.
పెళ్లి గుంభనంగా చేసుకున్నప్పటికీ, వెడ్డింగ్ పార్టీ మాత్రం గ్రాండ్ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఈ హీరో. పరిస్థితులన్నీ సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ఇండస్ట్రీ ప్రముఖులకు గ్రాండ్ గా పెళ్లి పార్టీ ఇవ్వబోతున్నాడు.