వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దెబ్బకు సాక్షి ఎడిటర్ మురళి, సీఈఓ వినయ్ మహేశ్వరి సీబీఐ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్‌కు సంబంధించి కోర్టు విచారణలో ఉండగానే, రఘురామ పిటిషన్‌ను కొట్టి వేసిందంటూ సాక్షి వెబ్ పేజీలో వార్త ప్రత్యక్షమైంది. కానీ అలా జరగలేదు.
జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్లపై ఒకేసారి తీర్పు చెబుతామంటూ సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సాక్షి కథనం న్యాయస్థానాన్ని ధిక్కరించినట్టుగా వుందని రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌ను గురువారం నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. ఈ విచారణకు సాక్షి మీడియా ఎడిటర్ మురళి, సీఈఓ వినయ్ మహేశ్వరికి హాజరయ్యారు. కౌంటర్ దాఖలకు మరో రెండు వారాలు గడువు కావాలని సాక్షి మీడియా కోరింది.
కానీ అంత సమయం ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సోమవారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఎవరో చేసిన తప్పునకు సాక్షి ఎడిటర్ బాధ్యత వహించాల్సి వచ్చింది. దీన్నిబట్టి వార్తల ప్రచురణలో, వెబ్ పేజీలో క్యారీ చేసే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇదే నిదర్శనం.