వినాయకచవితి సామూహిక ఉత్సవాల విషయంలో బీజేపీ వాళ్లు తాము చేయాల్సిన పని తప్ప అన్నీ చేస్తున్నట్టుగా ఉన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు గైడ్ లైన్స్ ను జారీ చేసింది. ఆ మేరకు ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం చాలా బాధపడుతూ ఉంది. ఒక రాష్ట్రంలో అని కాదు.. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ బాధపడిపోతూ ఉంది. తమిళనాడు, ఏపీల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉంది.
ఏపీలో అయితే ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ ను కలిసి బీజేపీ నేతలు విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుచితమైన నిర్ణయం తీసుకుందని, వినాయచవితి మండపాలకు అనుమతులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని బీజేపీ వాళ్లు గవర్నర్ కు విన్నవించారు. మరి గవర్నర్ కు చెబితే ఏం చేస్తారు ఆయన అయినా? కరోనా ప్రోటోకాల్స్ ను పక్కన పెట్టి వినాయక చవితిని నిర్వహించేందుకు అనుమతులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేరు కదా. ప్రభుత్వం నుంచి సమాచారం తెలుసుకోవచ్చు అంతే. అయ్యా ఇదీ పరిస్థితి అని ప్రభుత్వం చెబితే గవర్నర్ కూడా గద్దించలేరు. పరిస్థితిని అర్థం చేసుకుంటారు.
మరి బీజేపీ నేతలు చేయదగిన పని ఒకే ఒకటి ఉంది. వినాయకచవితి ఉత్సవాలు భారీగా, బహిరంగంగా జరగాలంటే.. కేంద్ర హోం శాఖను సంప్రదించాలి. కేంద్ర హోం శాఖ లేదా ప్రధానమంత్రిని కలిసి.. దేశమంతటా వినాయక ఉత్సవాలను జరపడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించడానికి వీల్లేదని ఆదేశాలు ఇప్పటించాలి. కోవిడ్ ప్రోటోకాల్స్ ను పక్కన పెట్టమని… బీజేపీ కోరుతున్నట్టుగా వినాయక ఉత్సవాలను నిర్వహించడానికి అనుమతులు ఇవ్వాలని ప్రధానమంత్రి కానీ, కేంద్ర హోం శాఖ కానీ ఆదేశాలను జారీ చేస్తే.. ఈ సమస్యకు ఇట్టే పరిష్కారం దొరుకుతుంది.
అయితే బీజేపీ నేతలు ఆ ఒక్కటీ మాత్రం చేయడం లేదు. దేశంలో కోవిడ్ ఆంక్షలను ఎత్తేయమని కేంద్రాన్ని కమలం పార్టీ వాళ్లు అడగరు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అంటూ రచ్చ చేసే బదులు.. ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలు వినాయక చవితి ఉత్సవాలకు వ్యతిరేకంగా ఉన్న ఆంక్షలన్నింటినీ దేశ వ్యాప్తంగా రద్దు చేయించేస్తే.. అప్పుడు కదా కేంద్రంలో అధికారంలో ఉన్నందుకు అర్థం. అధికారం లేని చోట పోరాటానికి బదులు, ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుంటే.. అప్పుడు బీజేపీ తను చెబుతున్న హిందుత్వ వాదానికి ఒక అర్థం ఉంటుందేమో!