తెలంగాణలో సినిమా రంగం మీద 100 కోట్ల వరకు జీఎస్టీ వసూళ్లు వుంటున్నాయని, కానీ ఆంధ్రలో మాత్రం గట్టిగా పాతిక, ముఫై కోట్లు కూడా వుండడం లేదని ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి కారణం థియేటర్ల దగ్గర లెక్కలు తేడా అని ఓ టాక్ వుంది. అయితే ఇంట్రస్టింగ్ సంగతి మరొకటి వినిపిస్తోంది.
ఆంధ్రలో వస్తున్న సినిమా రంగం మీద జీఎస్టీ వసూళ్ల నుంచి ఇన్ పుట్ క్రెడిట్ రూపంలో తెలంగాణకు వెళ్లిపోతున్న మొత్తం ఎక్కవగా వుంటోందన్నది ఆ పాయింట్. తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తరువాత ఈ తరహా ఆదాయాన్ని కూడా 60-40 రేషియోలో పంచుకోవాలన్న విషయం పక్కన పడిపోయింది.
ఓ నిర్మాత ఓ సినిమా తీసారు అనుకుందాం. నిర్మాత జీఎస్టీ అన్ని విధాలా పే చేస్తారు. కానీ ఆయనకు ఇన్ పుట్ క్రెడిట్ రావాలికదా? అది ఎక్కడి నుంచి వస్తుంది. ఆంధ్రలో టికెట్ ల మీద వసూలైన జీఎస్టీ నుంచి రావాల్సి వుంటుంది.
ఎగ్జిబిటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు, వాళ్ల నుంచి నిర్మాతకు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆంధ్రలో వుంటారు. నిర్మాతల అక్కౌంట్ హైదరాబాద్ లో వుంటుంది. ఇదే ఫైనల్ అక్కౌంట్. అక్కడ వస్తోంది అసలు సమస్య అని ఓ నిర్మాత వివరించారు.
రాష్ట్ర విభజన తరువాత అన్నీ పంచుకున్నట్లే టాలీవుడ్ మీద వచ్చే ఆదాయాన్ని కూడా పంచమని కేంద్రాన్ని కోరి వుంటే అది వేరుగా వుండేదని పలువురి అభిప్రాయం. ఇప్పటికైనా మించిపోయింది లేదేమో?