అఫ్గానిస్తాన్ లో తాలిబన్ల పాలన ప్రారంభం అయ్యాకా.. మధ్యయుగం ముస్లిం నియమాలు ఒక్కొక్కటి అమలవుతున్నాయి. ఇప్పటికే కళాశాలలు, స్కూళ్లలో కో ఎడ్యుకేషన్ పై తాలిబన్లు ఆంక్షలు పెట్టారు. తప్పనిసరి చోట అబ్బాయిలకూ, అమ్మాయిలకు మధ్యన తెరలను వేలాడదీశారు. ఇక అంతర్జాతీయంగా ఆక్షేపణకు గురయ్యే మరో నిర్ణయాన్ని కూడా తాలిబన్లు ప్రకటించారు. అదే స్త్రీలకు ఆటల్లో నిషేధాన్ని విధించడం.
అమ్మాయిలు గేమ్స్, స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొనడానికి వీల్లేదని వారు స్పష్టం చేశారు. ఆటల సమయంలో స్త్రీల శరీరాలు ఎక్స్ పోజ్ అవుతాయని.. అందుకే ఆడవాళ్లపై ఈ నిషేధాజ్ఞలు ఉంటాయని తాలిబన్ల సంస్కృతిక శాఖ స్పష్టం చేసింది.
ఇప్పటికే స్త్రీలకు పలు ప్రతిబంధకాలను ప్రకటించారు తాలిబన్లు. గత ఇరవై యేళ్లలో పోర్న్ సినిమాల్లో నటించిన వాళ్లను, వేశ్య వృత్తిలో పని చేసిన వారిని హతమార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇప్పుడు ఆటల విషయంలో కూడా తాలిబన్లు తమవైన ఆంక్షలను అమలు చేస్తూ ఉన్నారు.
ఈ అంశంపై అంతర్జాతీయ క్రీడా సంస్థలు కూడా స్పందిస్తున్నాయి. తాలిబన్లు స్త్రీలపై ఈ తరహా వివక్షను అమలు పరిస్తే… ఆ దేశంలో క్రీడా సంబంధాలను బహిష్కరించే ఆలోచన చేస్తున్నాయవి. ఇప్పటికే ఆస్ట్రేలియా స్పందించింది. స్త్రీలకు క్రీడాల్లోకి అనుమతిని ఇవ్వకుండా నిషేధాజ్ఞల నేపథ్యంలో.. ఆఫ్గాన్ క్రికెట్ జట్టుతో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ పై పునరాలోచిస్తున్నట్టుగా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
త్వరలోనే ఆఫ్గాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్యన ఒక టెస్టు మ్యాచ్ ను ప్లాన్ చేశారు. ఆస్ట్రేలియాలోనే ఆ మ్యాచ్ జరగనుంది. అయితే తాజాగా తాలిబన్లు స్త్రీలపై క్రీడా నిషేధం నేపథ్యంలో.. తమ జట్టు ఆఫ్గాన్ పురుషుల క్రికెట్ జట్టుతో మ్యాచ్ ఆడటం గురించి పునరాలోచన చేస్తున్నట్టుగా ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.