త‌మ్ముడికి ఓటేసేందుకు వ‌చ్చాడా?

కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న ముగించుకుని హైద‌రాబాద్ వ‌చ్చారు. మునుగోడు ఉప ఎన్నిక రేపు జ‌ర‌గ‌నుంది. కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి…

కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న ముగించుకుని హైద‌రాబాద్ వ‌చ్చారు. మునుగోడు ఉప ఎన్నిక రేపు జ‌ర‌గ‌నుంది. కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి తెలిసిందే. రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామా, ఆమోదం, ఉప ఎన్నిక అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. మ‌రోవైపు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఉప ఎన్నిక ప్ర‌చారానికి దూరంగా ఉన్నారు.

ఒక వైపు పార్టీ, మ‌రోవైపు ర‌క్త సంబంధం. గ‌త రెండు నెల‌లుగా అనేక నాట‌కీయ ప‌రిణామాలు న‌ల్గొండ‌లో, కాంగ్రెస్ పార్టీలోనూ చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అభ్య‌ర్థి పాల్వాయ్ స్ర‌వంతికి మ‌ద్ద‌తుగా వెంక‌ట‌రెడ్డి ప్ర‌చారం చేయ‌లేదు. పార్టీ ఏద‌ని చూడ‌కుండా త‌మ్ముడైన రాజ‌గోపాల్‌రెడ్డికి ఓట్లు వేయాలంటూ వెంక‌ట‌రెడ్డి ఆడియో లీక్ అయ్యింది.

ఈ ఆడియోపై కాంగ్రెస్ అధిష్టానం సీరియ‌స్ అయ్యింది. వివ‌ర‌ణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. మ‌రోవైపు ఈ వ్య‌వ‌హారాల‌న్నీ వెంక‌ట‌రెడ్డి ఆస్ట్రేలియా పర్య‌ట‌న‌లో ఉండ‌గా సాగాయి. ఈ నేప‌థ్యంలో స‌రిగ్గా ఎన్నిక‌కు ముందు రోజు ఆయ‌న తెలంగాణ‌కు రావ‌డం చ‌ర్చ‌కు తెర‌లేచింది.

త‌మ్ముడికి కీల‌క స‌మ‌యంలో అండ‌గా నిలిచేందుకు ఆయ‌న వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మ్ముడికి ఓటు వేసేందుకే విదేశీ ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చిన‌ట్టు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే సంద‌ర్భంలో షోకాజ్ నోటీసుకు వెంక‌ట‌రెడ్డి వివ‌ర‌ణ ఏం ఇస్తార‌నే ఉత్కంఠ నెల‌కుంది. కాంగ్రెస్ పార్టీపై విధేయ‌త ప్ర‌ద‌ర్శిస్తారా? లేక ధిక్కార స్వ‌రం వినిపిస్తారా? అనే చ‌ర్చ న‌డుస్తోంది. గ‌తంలో ప‌లుమార్లు కోమ‌టిరెడ్డి నోరు పారేసుకుని, ఆ త‌ర్వాత స‌ర్దుకున్న సంగ‌తి తెలిసిందే.