రాజకీయాలు కులం కంపుకొడుతున్నాయి. కులమతాలకు అతీతంగా రాజకీయాలు నడుస్తున్నాయని ఎవరైనా అంటే అది పచ్చి అబద్ధం. టీడీపీ, వైసీపీలను ఏ కులం కోణం నుంచి జనం చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనసేనాని పవన్‌కల్యాణ్‌ను కూడా అదే దృష్టితో చూస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిని ఆయన కులం కోణం నుంచే చూస్తారు. కానీ తాను కులరహిత రాజకీయాలు చేయాలని పవన్‌కల్యాణ్ జనసేన పెట్టిన తొలిరోజుల్లో చెప్పారు.
ఆ తర్వాత తత్వం బోధపడ్డాక పవన్‌కల్యాణ్ కులాన్ని గాఢంగా ప్రేమిస్తున్నారు. చంద్రబాబు, జగన్ ఎప్పుడైనా తమ కులాల గురించి ప్రస్తావించడం చూశామా? అప్పుడప్పుడు చంద్రబాబు తనపై కోపంతో కమ్మవాళ్లను అణచివేస్తున్నారని వాపోతుంటారు. జగన్ మాత్రం ఎప్పుడూ తన సామాజిక వర్గం గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ పవన్‌కల్యాణ్ మాత్రం పదేపదే తన సామాజిక వర్గం, అనుబంధ కులాల గురించి ప్రస్తావిస్తూ, జగన్ ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదే సందర్భంలో తన సామాజిక వర్గం బలంగా ఉన్న చోటే నిలిచేందుకు ఆయన నియోవర్గం వెతుకులాటలో ఉన్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా పిఠాపురాన్ని ఎంచుకున్నారని సమాచారం. రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులుంటాయని పవన్ ఊహించినట్టు లేదు. పవన్‌కు కాపు, బలిజ సామాజిక వర్గాలను దూరం చేసేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రాజమహేంద్రవరంలో కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర అధికార పార్టీ నేతలంతా సమావేశమయ్యారు.
దీంతో అధికార పార్టీ కాపు నేతలపై జనసేన, టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాపుల్లో చీలిక తెస్తున్నారని మండిపడుతున్నారు. కాపు ఓట్ల కోసమే కదా పవన్‌తో చంద్రబాబు జత కట్టేందుకు తహతహలాడుతున్నారనే సంగతి ఎవరికి తెలియదు? పవన్‌కు ఆయన సామాజిక వర్గంలోని యువత, సినీ అభిమానులు తప్ప, మరెవరైనా మద్దతుగా నిలుస్తారా? గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు 6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉభయగోదావరి జిల్లాల్లో 13 లేదా 14 శాతం ఓట్లు ఆ పార్టీకి దక్కాయి. ఎందుకంటే అక్కడ కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
జనసేన ఒంటరిగా పోటీ చేస్తే, ఆ మాత్రం ఓట్లు వచ్చాయి. చంద్రబాబు పల్లకీ మోయడానికి కాపులు ముందుకొస్తారా? తాను ముఖ్యమంత్రి కావడానికి కాకుండా, చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకైతే తామెందుకు మద్దతు ఇవ్వాలని కాపులు ప్రశ్నించడంలో తప్పేం వుంది? కాపులకు ఆరాధ్య నాయకుడైన వంగవీటి రంగాను నిర్ధాక్షిణ్యంగా బలి తీసుకున్న టీడీపీని ఆ సామాజిక వర్గం ఆదరిస్తుందా? రాయలసీమలో మెజార్టీ బలిజలు టీడీపీ వైపు ఉన్నారు. కానీ కోస్తాలో ఆ పరిస్థితి లేదు.
ఎందుకంటే వంగవీటి రంగాను అంతమొందించిన టీడీపీని తమ కుల శత్రవుగానే కాపులు చూస్తున్నారు. అందుకే గత ఎన్ని కల్లో రంగా కొడుకుని టీడీపీలో చేర్చుకుని, కాపుల ఓట్లను దండుకోవాలని చంద్రబాబు చూశారు. బాబు ఆలోచనల్ని కాపులు చిత్తు చేశారు. రంగా వారసుడితో లాభం లేదనుకుని మళ్లీ దత్త పుత్రుడిని నమ్ముకున్నారు. ఎవరైనా ఒకట్రెండు సార్లు మోసం పోతారు. పదేపదే మోసం పోవడానికి కాపులు అమాయకులు కారు.
పవన్‌కల్యాణ్ ఉద్దేశం తెలిసిన కాపులు, చివరికి ఆయన్ని అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది. దాన్ని వైసీపీ సొమ్ము చేసుకునేందుకు మైండ్‌గేమ్ ఆడుతోంది.