ఒకరు కేవలం మాటల గారడీ చేస్తారు. మరొకరు చేతల్లోనే చూపిస్తారు.
ఒకరు పైపై మెరుగులకే ప్రాధాన్యం. మరొకరు శాశ్వత పరిష్కారం కోసం ఆరాటం.
ఒకరు ప్రచారానికే పరిమితం. మరొకరు ప్రజల కోసం ఆరాటం.
చంద్రబాబు, జగన్ మధ్య తేడాలు చెప్పమంటే ఇలా లక్ష తేడాలు చెప్పొచ్చు. కానీ అదేంటో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాత్రం ఇందులో ఒక్క తేడా కూడా కనిపించడం లేదు. అధికారంలో లేనప్పుడు జగన్ పై విరుచుకుపడిన జనసేనాని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదేపనిగా విమర్శలు చేస్తూ కాలం గడిపేస్తున్నారు.
పవన్ ఆ మధ్య ఓ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అదే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య. కిడ్నీ బాధితుల సమస్యకు ఓ శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా పవన్ చాలా కృషిచేశారు. బాధిత ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు నిపుణులతో చర్చించారు. ఇదే విషయంపై అప్పటి సీఎం చంద్రబాబుతో కూడా చర్చించారు. పవన్ ను తృప్తిపరచడం కోసం చంద్రబాబు కంటితుడుపు చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద మంచి నీటి వసతి ఏర్పాటుచేశారు. డయాలసిస్ ప్లాంట్స్ పెట్టడానికి అంగీకరించారు. అయితే అవన్నీ అరకొరగానే జరిగాయనే విషయం అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఇదే అంశంపై జగన్ కూడా స్పందించారు. మొన్నటివరకు ప్రతిపక్ష నేత హోదాలో ఉద్దానం సమస్యపై పోరాడిన జగన్, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఉద్దానంలో కిడ్నీ సమస్య రావడానికి ప్రధాన కారణం అక్కడున్న నీరు తాగడమే అనే విషయాన్ని చాలామంది గుర్తించారు. అందుకే జగన్ 600 కోట్ల రూపాయలతో సమగ్ర మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టారు. స్థానికంగా ఉన్న నీటిని తాగితే సమస్య వస్తుంది కాబట్టి.. మంచినీటి కోసం జిల్లాలోని రేగులపాడు వద్ద రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించారు.
ఈ రిజర్వాయర్ ద్వారా మంచినీటికి బాధిత ప్రాంతాలకు సరఫరా చేయబోతున్నారు. దీనివల్ల పలాస, కాశీబుగ్గ, ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లోని 800కు పైగా నివాస ప్రాంతాలకు మంచినీరు అందుతుంది. కిడ్నీ సమస్య కొలిక్కి వస్తుంది. ఈ పని చేయడానికి గత ప్రభుత్వానికి చేతులు రాలేదు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ జగన్, తన చేతలతో పరిష్కారం చూపించారు. సమగ్ర మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టడంతో పాటు ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న అందరికీ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు జగన్.
ఐదేళ్ల చంద్రబాబు పాలనకు, 4 నెలల జగన్ నిబద్ధతకు తేడా చెప్పడానికి ఉద్దానం సమస్య ఒక్కటిచాలు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో జగన్ చేసి చూపిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో అంశాలకు సంబంధించి జగన్ వద్ద సమగ్ర నివేదిక ఉంది. పరిష్కార మార్గాలున్నాయి. ఈ విషయాన్ని పవన్ తెలుసుకుంటే మంచిది. అదే పనిగా బాబును వెనకేసుకొస్తున్న పవన్, కనీసం ఉద్దానం విషయంలోనైనా వైసీపీ సర్కార్ పనితీరును గుర్తిస్తే మంచిది.