తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలందరూ పెద్దస్థాయిలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచడం ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ధర్నాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ వీలైనంత రభస చేయాలని, ఎంత గొడవలు జరిగితే అంతగా తమకు రాజకీయ లబ్ధి ఉంటుందని ఆశిస్తున్నట్లుగా కనబడుతోంది. అయితే ప్రజలు మాత్రం ఇసుక వైఫల్యాలపై ఇప్పుడు ధర్నా చేయడం, ముందే కూసిన కోయిల మాదిరిగా ఉన్నదని నవ్వుకుంటున్నారు.
ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా తొందరపడి ఒక చర్య తీసుకోవడం వలన ఇసుక కొరతతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడినమాట వాస్తవం. చాలాచోట్ల భవన నిర్మాణ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అత్యవసరంగా పనులు చేసేవారు భారీగా డబ్బుపెట్టి కొనుగోలు చేయాల్సి వచ్చింది. కొన్నిచోట్ల ఇసుక ధర ఎక్కువగా ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి.
అయితే ఎలాంటి అవినీతి చోటులేని, పారదర్శకమైన ఇసుక విధానాన్ని తీసుకువచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు పాత ఇసుక రద్దుచేసే నిర్ణయం తీసుకున్నది నిజం. కొత్త విధానాన్ని అమల్లోకి తేవడంలో జాప్యం జరిగింది. అందువల్ల ప్రభుత్వం నిందలు పడవలసి వచ్చింది. తీరా కొన్ని రోజుల కిందట టెండర్లు మొత్తం పూర్తిచేశారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త ఇసుక విధానం ప్రకారం ప్రజలకు అందుబాటులోకి రానుంది.
ఇసుకకొరత అనే సమస్య ప్రజలను ఇబ్బందిపెడుతూ ఉన్నన్ని రోజులపాటు ప్రధాన ప్రతిపక్షం మాటలతో, విమర్శలతో కాలయాపన చేసింది. తీరా ప్రక్రియ మొత్తం పూర్తిఅయి, కొన్నిరోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావలసినంత ఇసుక అందుబాటులో ఉంటుంది అనుకుంటుండగా ఇప్పుడు ధర్నాలకు నిరసనలకు దిగడం హాస్యాస్పదంగా ఉంది.
ఇదే తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే గనుక.. కొత్త విధానంలో ఇసుక రవాణా అమల్లోకి వచ్చిన తరువాత కొన్నివారాల పాటు పరిస్థితులను గమనించి.. ఆ విధానం వలన సామాన్యులకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే వాటిని దూరం చేయడానికి అప్పుడు ధర్నాలు నిరసనలు చేసి ఉంటే ప్రజలకు మేలు జరిగేది.
కానీ తెలుగుదేశం పార్టీ దృక్పధంలో ప్రభుత్వం మీద బురదజల్లడమే తప్ప ప్రజలకు మేలు జరగడం అన్నది లక్ష్యం కాదు. అందుకే కొత్త విధానం రాకముందే రాష్ట్రవ్యాప్త నిరసన చేస్తున్నారు. వీరి చర్య తొందరపడి ముందేకూసిన కోయిల ఉన్నదంటే ఆశ్చర్యం ఏముంది?