రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించిన తర్వాత కూడా, పూర్తిస్థాయిలో రాజధాని వ్యవహారంపై స్పష్టతరాలేదు. ఇంకా ఇంకా అమరావతిపై చర్చ జరగాల్సి వుందన్న విషయాన్ని స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణ సెలవిచ్చారు. రాజధాని అమరావతి నుంచి తరలి వెళ్ళిపోతుందా.? అన్న ప్రశ్నకు బొత్స మరోసారి సమాధానం దాటవేయడంతో, అమరావతిపై అనిశ్చితి కొనసాగుతోంది.
'ఎవరెవరో ఏవేవో మాట్లాడుతున్నారు.. వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..' అంటూ బొత్స, రాజధాని తరలింపుకి సంబంధించి బీజేపీ ముఖ్యనేత జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తప్ప, 'రాజధానిని మార్చబోవడంలేదు' అని క్లారిటీ ఇవ్వలేదాయె. నిజానికి, అమరావతి విషయమై ప్రజల్లో కొంత ఆందోళన కాదు, చాలా ఆందోళనే వుంది. రాజధాని అంటే, రాష్ట్ర ప్రజలకు ఆత్మగౌరవం.. ఇందులో ఇంకోమాటకు ఆస్కారమే లేదు.
అయినాగానీ, అమరావతి విషయంలో మొదటి నుంచీ చంద్రబాబు ఆలోచనలు ఏకపక్షంగానే జరిగాయి. 'ఓ సామాజిక వర్గం కోసమే అమరావతి' అనే అభిప్రాయాన్ని ఆయనే తన పాలనలో కలిగించారు. చివరికి ఆ సామాజిక వర్గం మెప్పు కూడా పొందలేకపోయారనుకోండి.. అది వేరే విషయం. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా రాజధాని అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది తప్ప, రాజధాని నిర్మాణం మాత్రం పూర్తి కాలేదన్నది ఓపెన్ సీక్రెట్.
ఈ పరిస్థితుల్లో రాజధాని అక్కడే వుండాలా.? వుంటే ఎలా వుండాలి.? మారితే ఎక్కడకు మారాలి.? అన్న చర్చకు ఆస్కారమేర్పడడం సహజం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహా అనేక అంశాల్ని దృష్టిలో పెట్టుకుని, కొత్త ప్రభుత్వం తనదైన నిర్ణయం తీసుకోవాల్సి వుంది. చంద్రబాబు చెప్పినట్లు లక్షల కోట్లు రాజధానికి వెచ్చిస్తే, రాష్ట్రం ఏమైపోవాలి.? ఇక్కడే వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకింత ఆచితూచి వ్యూవహరిస్తోందని అనుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లో చాలా నగరాల్లో అభివృద్ధికి అనువైన పరిస్థితులున్నాయి. రాజధాని మారుతుందని అనుకోలేంగానీ, రాజధాని కంటే శరవేగంగా అభివృద్ధికి ఆస్కారం వున్న ప్రాంతాల్ని ఆ దిశగా ప్రోత్సహిస్తే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇదే అభిప్రాయం నిన్నటి సమీక్షలో కూడా వ్యక్తమయినట్లు తెలుస్తోంది.