అమరావతిపై టీడీపీకి, విశాఖపై వైసీపీకి ప్రేమ ఉన్నాయనుకోవడం పచ్చి అబద్ధం. చంద్రబాబుకైనా, జగన్‌కైనా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. వాటి కోసమే రాజధాని అంశం తెరపైకి వచ్చిందనేది నిజం. రాజధానిపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల విమర్శలు గమనిస్తే… అసలు వాస్తవం ఏంటో మనకు అర్థమవుతుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి తాజా విమర్శలను ఒకసారి పరిశీలిద్దాం.
విశాఖతో పాటు ఆ నగరం చుట్టూ కొల్లగొట్టిన భూముల రేట్లు పెంచుకోడానికే విశాఖను రాజధానిగా ప్రకటించారని అచ్చెన్నాయుడు విమర్శించారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం, దాని కోసం టీడీపీ పోరాటాలు చేయడానికి ప్రధాన కారణం… అక్కడ అప్పనంగా దోచుకున్న భూముల విలువ పడిపోతుందనే అని వైసీపీ తీవ్ర ఆరోపణ చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సామాజిక వర్గానికి అమరావతిలో భూములు వుండడం, అసైన్డ్ భూములను టీడీపీ నేతలు పెద్ద మొత్తంలో సొంత చేసుకున్న సంగతి తెలిసిందే.
అమరావతి నుంచి విశాఖకు రాజధాని మారిస్తే… ఒక్కసారిగా పచ్చ బ్యాచ్ ఆర్థిక సౌధం కూలిపోతుందనే ఆందోళన నెలకుంది. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తున్న చందంగా, ఏపీలో రాజధాని చుట్టూ అధికార, ప్రతిపక్ష పార్టీలు తిరుగుతూ వున్నాయి. వీటితో సంబంధం లేని సామాన్య ప్రజానీకం మాత్రం సినిమా చూసినట్టు చూస్తోందే తప్ప, ఏదీ పట్టించుకోవడం లేదు. ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి వుండడం వల్లే అమరావతి కోసం టీడీపీ పట్టుబడుతోందనేది జనంలోకి బాగా వెళ్లింది.
దాన్ని దెబ్బ తీసేందుకే విశాఖను రాజధానిగా వైసీపీ ప్రకటించిందని జనం నమ్ముతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ ముఖ్య నేతలు కొంత వరకూ విశాఖలో స్థిరాస్తులను సొంతం చేసుకున్నారు. వాటి విలువ పెంచుకునేందుకు వైసీపీ నేతలు నానాతిప్పలు పడుతున్నారు. రాజధాని ఎపిసోడ్‌లో ఆర్థిక ప్రయోజనాలు లేని వారిని భాగస్వామ్యం చేసేందుకు రాజకీయ పార్టీలు తంటాలు పడుతున్నారు.
అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్న వారిని చూస్తే…వ్యాపార భయం కనిపిస్తుంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఇక తమ జీవితాలకు శాశ్వతంగా అమరావతి సమాధి కడుతుందనే ఆందోళన వారిలో వుంది. అందుకే అమరావతి కోసం ఎందాకైనా అంటూ కాళ్లరిగేలా తిరగడం. అమరావతి రాజధాని కోసం త్యాగం చేశామనే మాటలకు విశ్వసనీయ లేకపోవడానికి ప్రధాన కారణం, రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలే. రాజధానితో మానసిక బంధాన్ని ముడిపెడుతూ చెప్పే మాటలను విశ్వసించే అమాయకులు లేరు.