సీఎం జగన్ జనంలోకి రాలేదని, అందుకే ఆయనకు ప్రజా సమస్యలు తెలియడం లేదని ప్రతిపక్ష పార్టీలు తరచూ విమర్శిస్తుంటాయి. జగన్‌పై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల నేతలేమైనా జనంలో వుంటున్నారా? అంటే లేదనే సమాధానం వస్తోంది. అందుకే జగన్ ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వున్నా… అది ప్రతిపక్షాలకు అనుకూలంగా మారడం లేదు. టీడీపీ, జనసేన అధినేతలు ఎంతసేపూ ఎల్లో మీడియా, సోషల్ మీడియాలకే పరిమితమవుతున్నారు.
ఆ మాధ్యమాల ద్వారా జగన్‌పై వ్యతిరేకత నింపొచ్చని కలలు కంటున్నారనే విమర్శ వుంది. చంద్రబాబు చెప్పినా, చెప్పక పోయినా నైతికంగా తమను తాము బలి పెట్టుకుంటూ ఆయన కోసం పని చేసే ఎల్లో మీడియా వుంది. జగన్‌పై జనంలో తీవ్ర వ్యతిరేకత సృష్టించి, అది చంద్రబాబుకు రాజకీయంగా ఉపయోగపడేలా చేయడం తమ బృహత్తర బాధ్యతగా ఎల్లో మీడియా భావిస్తూ వుంటుంది. అందుకే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతల కంటే దూకుడుగా ఎల్లో మీడియా వ్యవహరిస్తోంది.
ఇక పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే… షూటింగ్‌లు లేని సమయంలో ఆయన రాజకీయ కార్యకలాపాలు చేస్తుంటారు. ఆ కార్యక్రమాలకు చక్కటి పేరు పెట్టి, అభిమానుల్ని రంజింప చేస్తుంటారు. సంచలనాలకు తప్ప పార్టీ ఎదుగుదలకు పవన్ వైఖరి ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎల్లో మీడియాలో పవన్ పతాక శీర్షికలెక్కుతున్నారు. జగన్‌కు వ్యతిరేకంగా పవన్ రాజకీయ పంథా వుండడంతో ఎల్లో మీడియా ఆయన్ను నెత్తికెత్తుకుని ఊరేగుతోంది.
జనసేన నాయకుల స్థాయితో సంబంధం లేకుండా వైసీపీ ప్రభుత్వంపై ఎవరేం మాట్లాడినా చంద్రబాబు అనుకూల పత్రిక విశేష ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇక మీదట రెండు నెలల పాటు జనంలో వుండేందుకు చంద్రబాబు నిర్ణయించు కోవడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ అధినేతగా జగన్ జనంలో వుండకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి ప్రతిపక్షాల నేతలకు ఏమైంది? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వుందని ప్రతిపక్షాలు నమ్ముతున్నా… దాన్ని ఎందుకని సొమ్ము చేసుకోలేకపోతున్నాయో ఎవరికీ అర్థం కాదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీడీపీ నేతలెవరూ జనంలో అసలు కనిపించడం లేదు. ఈ విషయంలో అధికార పార్టీ నేతలే కాస్త మెరుగు అనిపిస్తోంది. కనీసం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగానైనా వారు జనం వద్దకు వెళుతున్నారు.
ఈ మూడున్నరేళ్లలో చేసిన మంచి పనులేంటో జనానికి వివరిస్తున్నారు. ప్రజలకు కలిగిన లబ్ధికి సంబంధించి ధ్రువీకరణ పత్రాలతో సహా ఇస్తున్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై టీడీపీ, జనసేన ఎందుకని క్షేత్రస్థాయి పోరాటాలకు సమాయత్తం కాలేదో వారే జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదే జగన్ ప్రతిపక్ష నేతగా నిత్యం జనంలో కనిపించారు. జగన్‌తో పోల్చుకుంటే ప్రస్తుత ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్ తదితర నేతలెవరూ పదిశాతం కూడా యాక్టీవ్‌గా లేరనే విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకంటూ చంద్రబాబు మనముందుకు వస్తున్నారు. టీడీపీకి ఇది మంచి పరిణామమే. అయితే చంద్రబాబు రెండునెలలు మాత్రమే ప్రజల్లో వుంటారట! ఆ తర్వాత జనవరిలో సంక్రాంతి నుంచి లోకేశ్ పాదయాత్ర చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోకేశ్ జనంలోకి వెళితే లాభనష్టాలపై టీడీపీ లెక్కలేస్తోంది. అందుకే లోకేశ్ పాదయాత్రకు బ్రేక్ పడినట్టు సమాచారం.
జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి బస్సు యాత్ర చేస్తానని పవన్ అప్పుడెప్పుడో ప్రకటించారు. ఈ విషయాన్ని జనంతో పాటు జనసేనాని కూడా మరిచిపోయారు. ఎందుకంటే పవన్‌కల్యాణ్ చెప్పిందేదీ చేయరు కాబట్టి, ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. ప్రతిపక్ష నేతలుగా చంద్రబాబు, పవన్ దొందూ దొందే అంటే కాదనగలరా? ప్రచార ఆర్భాటం తప్ప.. ఆచరణకు నోచుకోని నేతల మాటలను జనం పట్టించుకోరనేందుకు వీళ్లిద్దరే నిదర్శనం.