ప్రభుత్వ భూములను అప్పనంగా కొట్టేసేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. బినామీ పేర్లతో ప్రభుత్వ భూముల్ని సొంతం చేసుకునేందుకు నిషేధిత భూములపై కన్నేశారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నా… అధికార పార్టీ నేతలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందులో భాగంగా ప్రభుత్వమే దోపిడీకి శ్రీకారం చుట్టడం గమనార్హం. వ్యవస్థలపై జనానికి నమ్మకం పోవడానికి ప్రధానంగా రెండు శాఖలు కారణం. ఒకటి రెవెన్యూ, రెండోది పోలీస్‌శాఖ. ఈ రెండు శాఖలు అవినీతికి చిరునామాగా నిలిచాయి.
పాలకులు ఎవరైనా ఈ రెండు శాఖలను అడ్డంపెట్టుకుని సొంతింటిని చక్కదిద్దుకుంటుంటారు. తాజాగా జగన్ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. 22-ఎ నిషేధిత జాబితాలో వున్న భూముల వివరాలను సిద్ధం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారులకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మొదలుకుని కిందిస్థాయిలో వీఆర్వోల వరకూ అదే పనిలో ఉన్నారు.
అసైన్డ్, ప్రభుత్వ, దేవాదాయ/ వక్ఫ్ , చుక్కల భూములు, ఇతరత్రా భూముల వివరాలను కేటగిరీల వారీగా గుర్తించి, ఆ మేరకు విభజించి ఓ జాబితా తయారీలో రెవెన్యూ యంత్రాంగం వుంది. ఇలాంటి భూములను కొల్లగొట్టడానికి అధికారాన్ని వైసీపీ దుర్వినియోగం చేస్తోంది. తామేం చెప్పినా చేసే అధికారుల్ని అన్ని స్థాయాల్లో అధికార పార్టీ నేతలు నియమించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో తమ బినామీలను లబ్ధిదారులుగా చేర్చి, వారి పేర్లతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూమిని దోచుకోడానికి అధికార పార్టీ సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా అసైన్మెంట్ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కమిటీలో ఎమ్మెల్యే, ఆర్డీఓ, తహశీల్దార్ సభ్యులుగా వుంటారు. ఈ కమిటీ అధికారికంగా లబ్ధిదారులకు ప్రభుత్వ భూమిని కట్టబెడుతుంది.
ఆల్రెడీ ప్రభుత్వ భూమిలో సాగులో వుంటూ, సొంత భూమి లేని వారెవరికైనా ప్రభుత్వం డీకేటీ భూమి ఇవ్వొచ్చు. గ్రామాల్లో లభ్యతను బట్టి 1.50 ఎకరా లేదా ఎకరా చొప్పునా భూమి ఇవ్వొచ్చని నిబంధనలు చెబుతున్నాయి. మొదట గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారులను గుర్తిస్తారు. అనంతరం వారి జాబితాకు అసైన్మెంట్ కమిటీ ఆమోద ముద్ర వేయనుంది. ఇదంతా చకచకా చేసుకోడానికి అధికార పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు.
ఇక ఏడాదిన్నర మాత్రమే వైసీపీ అధికారంలో కొనసాగనుంది. దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకునే క్రమంలో అధికార పార్టీ నేతలు అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతున్నారనేది జనం మాట.