పరిస్థితులు కలిసి రాలేదు కాబట్టి కాంగ్రెసులోనే కొనసాగుతున్నారా.. లేక ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఈ పదవీకాలం పూర్తి అయ్యేదాకా అందులో కొనసాగదలుచుకున్నారా? అనేది తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గన్న వ్యవహార సరళి కొంచెం తేడా గానే కనిపిస్తోంది.
తమ పార్టీకి అధినాయకుడు రాహుల్ ‘భారత్ జోడో’ అనే నినాదంతో కన్యాకుమారిలో మొదలెట్టిన పాదయాత్ర తన నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో.. సాధారణంగా ఎంతో హైపర్ గా ఉండే ఈ నాయకుడు చాలా నీరసంగా మాట్లాడుతున్నారు! రాహుల్ పాదయాత్రకు సంబంధించి తన నియోజకవర్గంలో కనీస ఏర్పాట్లు చేయడానికి అప్పు కూడా పుట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆయన మాటలను గమనిస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. తాను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. సంపాదనపరంగా వైభవాన్ని చవిచూడడం అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని ఆయనకు అర్ధమైనట్లుగా కనిపిస్తోంది.
ఈ సంగతి పక్కన పెడితే.. తూర్పు జయప్రకాష్ రెడ్డి మాటల ద్వారా మరికొన్ని సంగతులు మనకు అర్థమవుతున్నాయి. బిట్వీన్ ది లైన్స్ గమనిస్తే.. రాహుల్ పాదయాత్రకు సంబంధించిన ఖర్చును ఆయా స్థానిక నియోజకవర్గాల్లోని నాయకులే భరించాలని పార్టీ పురమాయిస్తున్నదా అనే తొలి అనుమానం కలుగుతుంది.
వందల కోట్ల రూపాయల నిధులు మూలుగుతున్న జాతీయ కాంగ్రెస్ పార్టీ తమ ఖజానా నుంచి ఈ భారత జోడో కోసం ఏమీ ఖర్చు పెట్టడం లేదా అనే అనుమానం కూడా కలుగుతుంది. యాత్ర సాగే రూట్ లో ఉండే ఎమ్మెల్యేలు ఆ స్థాయి నాయకుల సంగతి సరే.. ఆ రూటుకి కుడి ఎడమ గా ఉండే ఇతర నాయకులు ఎవరూ ఖర్చులను షేర్ చేసుకోవడం లేదా.. అనే అనుమానం కూడా పుడుతుంది. మొత్తానికి ‘రాహుల్ భారత్ జోడో కోసం తనకు అప్పులు కూడా పుట్టడం లే’దన్న ఒకే ఒక్క మాట ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క దయనీయమైన స్థితిని జగ్గారెడ్డి తెలుగు ప్రజల కళ్ళకు కట్టారు.
పీసీసీ పదవుల పందేరం కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయాలపై తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్న తూర్పు జయ ప్రకాష్ రెడ్డి పక్కదారి చూసుకుంటున్నట్టుగా మాత్రం ఇప్పటిదాకా పొడ చిక్కలేదు. ఆయనకు గతంలో భారతీయ జనతా పార్టీలో పనిచేసిన అనుభవం ఉన్నది కానీ.. మళ్లీ అటువైపు వెళ్తారా అనే ఆలోచన ఎవరికీ రావడం లేదు.
మరి కాంగ్రెస్ లోనే తన రాజకీయ మనుగడను కోరుకుంటూ ఉంటే కనుక, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగల స్థాయి భవిష్యత్తు కూడా ఉన్నదని ఆయన నమ్ముతుంటే గనుక.. రాహుల్ యాత్రకు ఏర్పాట్లు చేయకుండా ఉంటారా? అది విజ్ఞతతో కూడుకున్న పనేనా అని ప్రజలు సోచాయిస్తున్నారు.