సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వచ్చింది. ఈ దేశపు రూపురేఖల నిర్మాణంలో తనదైన పాత్ర కలిగిఉన్న మహనీయుడిగా పటేల్ ను జాతి ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన విగ్రహాన్ని బృహత్ రూపంలో నిర్మించి, ఆయనను సొంతం చేసుకున్న మోడీ సర్కారు కూడా పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ సందర్భంగా అమిత్ షా మాటలే వెగటు పుట్టిస్తున్నాయి. 75 ఏళ్ల నాటి పాచిపోయిన సంగతులతో విమర్శలు, పాచిపోయిన మాటలనే పట్టుకుని.. ఇంకా ఆయన పటేల్ పేరు వాడుకుంటూ రాజకీయ లబ్ధి మీద దృష్టి పెట్టే మాట్లాడుతున్నారా? అనే అభిప్రాయమూ కలుగుతుంది.
జయంతి వేడుకల్లో అమిత్ షా మాట్లాడుతూ.. ఈ దేశానికి తొలిప్రధానిగా పటేల్ అయిఉంటే దేశం నేడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అసలు ఉండేవే కాదని వ్యాఖ్యానించారు. ఏదో కామెడీ కథల్లో కేరక్టర్లు చెప్పినట్టుగా.. మా ముత్తాత టాటా బిర్లా అయి ఉంటే నాకీ కష్టాలు ఉండేవే కాదు అని చెప్పుకుంటున్నట్టుగా ఉందీ వ్యవహారం. ఇలాంటి పసలేని మాటలతో అమిత్ షా కావొచ్చు.. బిజెపి ప్రమథ గణాలు కావొచ్చు… ఇంకా ఎంత కాలం సాగదీస్తారు.
నెహ్రూ దేశానికి తొలిప్రధాని కావడం వలన కొన్ని సమస్యలు ఏర్పడి ఉంటేగనుక.. వాటిని ప్రొజెక్టు చేయడం ద్వారా ఇప్పటికే అనేక దఫాలుగా వాళ్లు రాజకీయ లబ్ధిని మూటగట్టుకున్నారు కదా. అమిత్ షా చెప్పే భావజాలం విశ్వసించే వారినందరిలోనూ.. ఆ భావాలు చక్కగానే కుదురుకున్నాయి కదా! ‘పటేల్ తొలి ప్రధాని అయిఉంటే..’ అనే మాటను దేశంలోకి బాగానే చొప్పించారు కదా.. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ.. ఇంకా అదే మాట పట్టుకుని వేళ్లాడడం ఎందుకు అనేది ప్రజలకు ఎదురవుతున్న సందేహం.
కొందరు నాయకులు మాట్లాడితే.. వాళ్లు నిజం మాట్లాడినా కూడా అనుమానపు దృక్కులతో చూడాల్సి వస్తోంది. అది చూస్తున్న ప్రజల తప్పు కాదు. ఆ నాయకులు సంపాదించుకున్న క్రెడిబిలిటీ అలాంటిది. అమిత్ షా కూడా ఆ బాపతు నాయకుల జాబితాలో చేరిపోతున్నారా? అనిపిస్తోంది.
పటేల్ వంటి మహా నాయకుడి జయంతి వచ్చిన సందర్భంలో.. ఈ దేశపు యువత ఎలాంటి నిర్భీకతను అలవాటు చేసుకోవాలో.. ఆయనను చూసి నేర్చుకోవాలో.. అమిత్ జీ చాలా విపులంగా చెప్పి ఉంటే బాగుండేది. అంతే తప్ప.. ఈ సందర్భం నుంచి కూడా.. ఏ కొంచెం రాజకీయ ప్రయోజనమైనా దక్కకపోతుందా అన్నట్టుగా.. ‘‘ఆనాడు అలా జరిగిఉంటే..’’ అంటూ ప్రారంభించడం మంచిది కాదు. ‘ఏమో అమిత్ షా చెబుతున్నది నిజమే కావొచ్చు.. పటేల్ తొలి ప్రధాని అయి ఉంటే ఈ దేశంలో బిజెపి పార్టీనే ఉండేది కాదేమో..’ అని జనం నవ్వుకుంటున్నారు.