జనసేన పార్టీలో నెంబర్ టూ నాయకుడు నాదెండ్ల మనోహర్.. ఒక అద్భుతమైన అభిప్రాయం వెలిబుచ్చారు. జనసేనాని పవన్ కల్యాణ్ ను తిట్టకపోతే.. సాయంత్రానికి తమ పదవులు పోతాయని వైసీపీ నాయకుల్లో భయం పెరుగుతోందన్నారు.
రాష్ట్రంలో జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి.. వైసీపీ పార్టీలో భయం పెరుగుతోందని సెలవిచ్చారు. అందుకే పవన్ కల్యాణ్ ను తిట్టడానికి ప్రత్యేకంగా మనుషుల్ని పురమాయించారన్నట్టుగా ఆక్రోశం వెలిబుచ్చారు. ఆయనను తిట్టడం కోసం కొందరు నాయకులు అసలు పరిపాలన వదిలేసి పనిచేస్తున్నారట. కాపునాయకులు అందరూ కలిసి రాజమండ్రిలో మీటింగు పెట్టుకుని జగన్ ను తిట్టడానికి కారణం.. అలా తిట్టేలా ప్రభుత్వం పెడుతున్న ఒత్తిడేనట! ఇలా ఆ ప్రఖ్యాత నాయకుడు తన బుద్ధికి తోచినట్లుగా బోలెడన్ని సంచలనాత్మక విషయాలు బయటపెట్టారు.
అయితే.. కులం పేరు పదేపదే తెస్తూ.. పదేపదే కులాల మాటెత్తుతూ రాజకీయాలను కులమయం చేస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్. నేను విశ్వమానవుడిని అని చెప్పుకుంటూ తన ప్రతి ప్రసంగంలో పదుల సంఖ్యలో కులాల పేర్లు చెప్పి.. వాళ్లందరినీ నేను ముఖ్యమంత్రుల్ని చేస్తాను.. అని గలీజు మాటలు మాట్లాడే వ్యక్తి పవన్ కల్యాణ్. అలాంటి పవన్ బుద్ధుల గురించి.. ఆయన కులానికి చెందిన కాపునాయకులు మీటింగుపెట్టి విమర్శలు చేస్తే దానిని ప్రభుత్వానికి పులిమి ఆనందించడం నాదెండ్ల మనోహర్ కు మాత్రమే చెల్లింది.
అయినా నాదెండ్ల మనోహర్ కామెంట్స్ చూసిన జనం మాత్రం నవ్వుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ను తిట్టకపోతే.. సాయంత్రానికి పదవులు పోతాయని వైసీపీ నాయకులు భయపడుతున్నారనే మాటల్లో నిజం ఎంత ఉన్నదో తెలియదు గానీ.. ప్రతినిత్యం ఏ మాట మాట్లాడినా.. దానికి ముందు ఒకసారి వెనక ఒకసారి పవన్ కల్యాణ్ భజన చేస్తూ ఉండకపోతే నాదెండ్ల మనోహర్ కు అసలు రాజకీయ జీవితమే ఉండదని జనం నవ్వుకుంటున్నారు.
ఎందుకంటే.. రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెసు పార్టీ నాయకుడిగా.. తెలుగుదేశంలోకి దూరడానికి అవకాశమే లేని (తండ్రి నాదెండ్ల భాస్కరరావు, ఎన్టీఆర్ ను పొడిచిన వెన్నుపోటు కారణంగా) నాదెండ్ల మనోహర్.. వేరే గతిలేక జనసేనలో చేరారు. పవన్ కల్యాణ్ కు కూడా.. కాస్త నాయకుడిగా ఉండగలపాటి తెలివితేటలు అనుభవం ఉన్న వ్యక్తులకు గతిలేక నాదెండ్ల మనోహర్ ను చేర్చుకున్నారు.
ఏ చెట్టూ లేనిచోట ఆముదం చెట్టే మహావృక్షం అయినట్టుగా.. పవన్ తప్ప నాయకులకే దిక్కులేని జనసేనలో నాదెండ్ల నెంబర్ టూ గా చెలామణీ అవుతున్నారు. పవన్ భజన చేయకపోతే.. ఆయన జనసేనలోంచి బయటకుపోవాల్సిందే. ఇక ఇంట్లో కూర్చోవాల్సిందే.
అందుకే రోజూ ఇరవై నాలుగు గంటలూ పవన్ భజన చేయడం ద్వారా ఆయన తన మనుగడ కాపాడుకుంటున్నారు. పాపం.. నాదెండ్లకు ఎన్నికష్టాలు వచ్చాయిరా దేవుడా అని జనం నవ్వుకుంటున్నారు.