ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత విశ్వసనీయ సంస్థ పీకే టీమ్ అని నిన్నటి వరకూ అనుకున్న మాట. నేడు “ఐ ప్యాక్” రూపంలో కొత్త టీమ్ వచ్చింది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి పీకే (ప్రశాంత్ కిషోర్) టీమ్ వ్యూహాలు పని చేశాయనేది అందరూ నమ్ముతారు. తాజాగా ఐ ప్యాక్ టీమ్ చురుగ్గా పనిచేస్తోంది. అయితే ఐ ప్యాక్ టీమ్ పంథాపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు గుర్రుగా ఉన్నారు.
ఐ ప్యాక్ టీమ్ వైఖరి వైసీపీలో వర్గాలను ప్రోత్సహించేలా వుందనేది వారి అభిప్రాయం. దశాబ్దాలుగా రాజకీయాల్లో తలమున కలవుతూ, ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని నిలబడ్డ తమకు ఐ ప్యాక్ టీమ్ రాజకీయ పాఠాలు చెప్పడం ఏంటనే ఆవేదన వారిలో కనిపిస్తోంది. ఇటీవల ఐ ప్యాక్ టీమ్ నియోజకవర్గాల వారీగా పార్టీకి చెందిన కొందరిని విజయవాడకు పిలిపించుకుంటోంది. వారందరితో కలిసి, ఆ తర్వాత ఒక్కొక్కరితో ఐ ప్యాక్ టీమ్ సమావేశమై నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితిపై వివరాలు రాబడుతోంది.
ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధి లేదా ఇన్‌చార్జ్‌కు వ్యతిరేకంగా ఏవైనా వుంటే చెప్పాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఇదే అవకాశంగా కొందరు ఉన్నవీ, లేనివీ చెబుతున్నారని తెలిసింది. ఆ తర్వాత వారు నియోజకవర్గానికి వచ్చి మంత్రి ,ఎమ్మెల్యే, ఎంపీలపై తాము ఫలానా విధంగా నెగెటివ్ చెప్పామని, సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారని కాలర్ ఎగురేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు.
పక్కన పెట్టిన వాళ్లను కూడా పిలిపించుకుని వ్యతిరేక అంశాలు చెప్పడానికి ఐ ప్యాక్ టీమ్ చెవి ఇవ్వడం ఏంటని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. అలాంటి వాళ్లను తాము ఎలా కలుపుకుని ముందుకెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. తమతో తీవ్ర వ్యతిరేకతను మనసులో నింపుకున్న నాయకులు వైసీపీకి అనుకూలంగా ఎలా పని చేస్తారని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిలదీస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్ జీతాల కోసం పని చేసే వాళ్ల నివేదికలు ఆధారపడడం ఏంటని నిలదీస్తున్నారు.
ఐ ప్యాక్ టీమ్ కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలపై సొంత పార్టీలోని వ్యతిరేక నాయకుల వాయిస్ వినడానికే ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇలాంటి వాటికి చోటు ఇస్తే, మరింత మంది వారికి తోడై పార్టీకి డ్యామేజీ కలుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమస్యలను పరిష్కరించే దిశగా ఐ ప్యాక్ టీమ్ వ్యవహార శైలి వుంటే బాగుండేదని, కానీ సృష్టించేందుకే పని చేస్తోందని మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు విమర్శిస్తున్నారు.
ఒక్కో నియోజకవర్గంలో నాలుగు లక్షల జనాభా వుంటే, 20 మందితో సమావేశమై సీఎం జగన్‌కు నెగెటివ్ నివేదిక ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వడం, వాటి ఆధారంగా ఏం చేయాలో, చేయకూడదో డైరెక్షన్స్ ఇవ్వడం ఆశ్చర్యంగా వుందని అంటున్నారు. సీఎం జగన్ ఎంతో నమ్మకంతో ఐ ప్యాక్‌కు బాధ్యత అప్పగించారని, వారు మాత్రం గ్రూప్‌లను ప్రోత్సహించేలా నడుచుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ.
ఐ ప్యాక్ టీమ్ నివేదికల మంచీచెడ్డలపై విచక్షణతో వ్యవహరించాల్సిన బాధ్యత, అవసరం జగన్‌పై వుంది. ఐ ప్యాక్ టీమ్‌ల నివేదికలపై సీఎం తీసుకునే నిర్ణయంపై వైసీపీ భవిష్యత్ ఆధారపడి వుందన్నది వాస్తవం.