ఏపీ స‌ర్కార్‌కు అద‌నపు బ‌లం

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అద‌న‌పు బ‌లం ఇచ్చే నిర్ణ‌యం. అది ఢిల్లీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం రూపంలో కావ‌డం విశేషం. వినాయ‌క చ‌వితి వేడుక‌లు జ‌గ‌న్ స‌ర్కార్‌కు అన‌వ‌స‌ర త‌ల‌నొప్పి తెచ్చి పెడుతున్నాయి. ప్ర‌తిదీ జ‌గ‌న్ మ‌తంతో…

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అద‌న‌పు బ‌లం ఇచ్చే నిర్ణ‌యం. అది ఢిల్లీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం రూపంలో కావ‌డం విశేషం. వినాయ‌క చ‌వితి వేడుక‌లు జ‌గ‌న్ స‌ర్కార్‌కు అన‌వ‌స‌ర త‌ల‌నొప్పి తెచ్చి పెడుతున్నాయి. ప్ర‌తిదీ జ‌గ‌న్ మ‌తంతో పెడుతూ బీజేపీ విద్వేష‌పూరిత రాజ‌కీయాల‌కు తెర‌లేపింద‌ని వామ‌ప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. 

మ‌రోవైపు ఎలాగైనా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీకి మ‌త‌ప‌ర‌మైన విభ‌జ‌న ఒక్క‌టే దిక్కైంది. మ‌రోవైపు వికాయ‌క చ‌వితి వేడుక‌లను ఏఏ రాష్ట్రాల్లో ఎలా నిర్వ‌హిస్తున్నార‌నే విష‌య‌మై ఏపీ ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఏపీ స‌ర్కార్‌కు ఓ తోడు దొరికింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో అక్క‌డి ప్ర‌భుత్వం కూడా కోవిడ్ ఆందోళ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌పై నిషేధం విధించింది. ఈ మేర‌కు ఢిల్లీ విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ బుధ‌వారం ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

బహిరంగ మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయకుండా జిల్లా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. సామూహిక ప్రదేశాలలో జనాలు భారీగా గుమిగూడకుండా చూడాలని సూచించింది. 

గణేశుడి ఊరేగింపులకు కూడా అనుమతి లేదని ఉత్తర్వులో తేల్చి చెప్పింది. ఇంట్లోనే పండుగ జరుపుకోవాలని ఢిల్లీ విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ సూచించింది.

ఏపీలో ఇవే ఉత్త‌ర్వులు ఇచ్చిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు మ‌తాన్ని అంట‌క‌ట్టి ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నాయి. మ‌రి ఇవే విమ‌ర్శ‌ల‌ను ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌పై బీజేపీ త‌దిత‌ర పార్టీలు చేయ‌గ‌ల‌వా? ఎందుకంటే కేజ్రీవాల్ నిఖార్పైన హిందువు. 

ఏది ఏమైనా ఢిల్లీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఏపీ స‌ర్కార్‌కు అద‌న‌పు బ‌లం వ‌చ్చిన‌ట్టైంది. ఇది ఒక ర‌కంగా జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఊర‌టనిచ్చే అంశ‌మే.