కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతాపార్టీతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల స్నేహబంధంపై పలు అనుమానాలున్నాయి.
తమ గుప్పిట్లో రాజ్యాంగ వ్యవస్థలను పెట్టుకున్న బీజేపీ, ప్రాంతీయ పార్టీలపై బెదిరింపులకు పాల్పడుతూ, నోరెత్తకుండా చేసుకుంటోందనే బలమైన విమర్శ ఉంది. ఈ విమర్శలకు బలం చేకూర్చేలా సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఘాటైన ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సీపీఐ అగ్రనేత కె.నారాయణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్‌లపై విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి అవగాహన ఉందని ఆరోపించారు.
బీజేపీ, టీఆర్ఎస్ గల్లీలో కుస్తీ… ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోడీ పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 27న భారత్ బంద్‌కు పిలుపిస్తున్నట్టు ఆయన తెలిపారు.
భారత్ బంద్‌లో టీఆర్ఎస్, టీడీపీ కూడా పాల్గొనాలని ఆయన కోరడం గమనార్హం. కానీ వైసీపీ పేరు ప్రస్తావించకపోవడం విశేషం. బీజేపీతో పరోక్షంగా అనుబంధం కొనసాగిస్తున్న టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలతో ఇదే సీపీఐ స్నేహాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు సీపీఐ అండగా నిలవనున్న సంగతి తెలిసిందే.