వచ్చే ఎన్నికలే కాదు మూడు దశాబ్దాల పాటు తానే సీఎం గా ఉంటానని, ఉండాలని జగన్ భావిస్తున్నారు. మరి జగన్ ఒకసారి గెలవడమే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వరసలో టీడీపీ ముందుంటే బీజేపీ కూడా పక్కన చేరింది.
ఏపీలో వినాయకచవితి ఉత్సవాలను బహిరంగంగా చేసుకోవడానికి జగన్ ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అన్న పాయింట్ పట్టుకుని బీజేపీ కొద్ది రోజులుగా విమర్శలు చేస్తున్న సంగతి విధితమే. ఈ నేపధ్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే, విష్ణు కుమార్ రాజు అయితే ఒక అడుగు ముందుకేసి జగన్ మళ్ళీ సీఎం అయితే తాలిబన్ల పాలనే వస్తుందని భయపడిపోతున్నారు, భయపెట్టేస్తున్నారు.
జగన్ పొరపాటున మళ్లీ సీఎం అయితే ఎవరి ఇంట్లోనూ వినాయకచవితి పండుగ చేసుకోనీయరుట. జగన్ అన్నీ తప్పుడు నిర్ణయాలే తీసుకుంటున్నారు అంటూ రాజు గారు గట్టిగానే సౌండ్ చేస్తున్నారు. సరే ఈ విమర్శల జోరులో రాజు గారు మరచిన విషయం ఒకటి ఉంది.
అదేంటి అంటే కేంద్రమే కరోనా నిబంధలను విధించింది అని. ఇక జగన్ ఇంట్లో వినాయకచవితి చేసుకోవద్దు అనలేదు, మండపాలు బయట పెట్టవద్దు అని మాత్రమే ఆదేశాలు ఇచ్చారని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి బీజేపీ నేతలకు వినాయక చవితి పండుగ వివాదం బాగా ఊపు తెచ్చేలా కనిపిస్తోంది. అందుకే నేతాశ్రీలు చాలా చాలా మాట్లాడేస్తున్నారు.