తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్‌కు గవర్నర్ తమిళిసై షాక్ ఇచ్చారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. హుజూరా బాద్ టీఆర్ఎస్ నేత కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ఆగస్టు 1న కేబినెట్ భేటీలో మంత్రివర్గం తీర్మానం చేసింది. ఆ వెంటనే ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపారు.
ఆరు వారాలు గడుస్తున్నా ఆమోదం తెలపకపోవడంతో పాటు బుధవారం గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సేవారంగం కోటాలో రాజకీయ నేత కౌశిక్‌రెడ్డి పేరును ప్రతిపాదించడంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదే ప్రజాకవి గోరేటి వెంకన్నను ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ కేసీఆర్ ఫైల్ పంపితే, మరుసటి రోజే గవర్నర్ ఓకే చేశారు. కానీ కౌశిక్ రెడ్డి విషయంలో గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో అతని నియామకంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కౌశిక్‌రెడ్డి నియామకానికి సంబంధించి మంత్రివర్గం సిఫార్సును మరింత అధ్యయనం చేయాల్సి ఉందని గవర్నర్ వ్యాఖ్యానించడంతో అతని నియామకంపై నీలినీడలు వ్యాపించాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో కౌశిక్‌రెడ్డి చేరిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ టికెట్‌ను ఆయన ఆశించారు. ఈ మేరకు తన సన్నిహితులకు చెప్పారు. అయితే కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేస్తూ, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను హుజూరాబాద్ అభ్యర్థిగా ప్రకటించారు.
కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేస్తూ గవర్నర్‌కు పంపడంతో, ఇక అధికారిక ప్రకటనే తరువాయని అందరూ భావించారు. ఇప్పటికే కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా పిలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో బుధవారం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి సేవారంగం కోటాలో సిఫార్సు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
సేవకు సంబంధం లేని రంగాలకు చెందిన వారిని ఆ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేయడం సరైంది కాదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై ఆలోచించాల్సి ఉందని ఆమె చెప్పారు. దీంతో కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కడంపై సర్వత్రా అనుమానాలు తలెత్తుతున్నాయి. అదను చూసి కేసీఆర్ సర్కార్‌కు గవర్నర్ గట్టి షాక్ ఇచ్చారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.