ఎట్ట‌కేల‌కు…వెన‌క్కి త‌గ్గిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం!

ఆ ఉత్త‌ర్వుల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు వెన‌క్కి త‌గ్గింది. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల స‌మాచారం ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా దాచి పెట్టాల‌ని ఇటీవ‌ల ఏపీ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మ‌రోవైపు ప్ర‌జల స‌మాచార హ‌క్కును…

ఆ ఉత్త‌ర్వుల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు వెన‌క్కి త‌గ్గింది. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల స‌మాచారం ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా దాచి పెట్టాల‌ని ఇటీవ‌ల ఏపీ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మ‌రోవైపు ప్ర‌జల స‌మాచార హ‌క్కును ప్ర‌భుత్వ‌మే కాల‌రాస్తోందంటూ ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలు పెట్టాయి. 

జీవోల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేకుండా ప్ర‌భుత్వం తీసుకున్న వివాదాస్ప‌ద నిర్ణ‌యంపై కొంద‌రు న్యాయ‌స్థానాన్ని కూడా ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా బుధ‌వారం కీల‌క ఉత్త‌ర్వులు వెల్ల‌డించింది.  

ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని  నిర్ణయించింది. అయితే పేరు మార్చింది. అదొక్క‌టే మార్పు. మిగిలిందంతా సేమ్ టు సేమ్‌.  జీవో ఐఆర్‌ వెబ్‌సైట్ స్థానంలో ‘ఏపీ ఈ-గెజిట్‌’ తెర‌పైకి వ‌చ్చింది. ‘ఏపీ ఈ-గెజిట్‌’ ద్వారా జీవోలు, ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల స‌మాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సీఎస్ వెల్ల‌డించ‌డం విశేషం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్ బుధ‌వారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్త‌ర్వుల్లో జీవో ఐఆర్‌ వెబ్‌సైట్‌ను నిలిపివేసిన కార‌ణంగా… ప్ర‌జానీకం సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా వివరాలను ఈ-గెజిట్‌లో ఉంచనున్నట్లు స్ప‌ష్టం చేశారు. అయితే ప్ర‌జావసరం లేని వ్యక్తిగతమైన సమాచారం, తక్కువ మొత్తంలోని ఖర్చులు, అధికారుల సెలవులు, గోప్యంగా ఉంచాల్సిన ఇతర అంశాలను మాత్రం అందులో అందుబాటులో ఉంచేది లేద‌ని ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది.

ఇకపై అన్ని జీవోలు సంబంధిత‌ డిజిటల్‌ సంతకంతో అందుబాటులో ఉండ‌నున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాగే ఇత‌ర విష‌యాల్లో కూడా ప్ర‌భుత్వం స‌ముచిత నిర్ణ‌యం తీసుకుంటే… రాజ‌కీయంగా వైసీపీకి లాభిస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.