విధానపరమైన నిర్ణయానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్య చేసింది. పిటిషనర్ ఆశిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది.
క్రికెట్ వల్ల హాకీ ప్రాభవాన్ని కోల్పోతోందని, కావున హాకీని జాతీయ క్రీడగా అధికారికంగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిల్ వేశారు.
ఈ పిల్‌పై జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. హాకీ క్రీడకు వైభవం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కావున జాతీయ క్రీడగా గుర్తించేలా ఆదేశించాలంటూ గట్టిగా వాదించారు.
ధర్మాసనం జోక్యం చేసుకుంటూ తామేమీ చేయలేమని స్పష్టం చేసింది. పిటిషనర్ కోరిన విధంగా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించలేమని తేల్చి చెప్పింది. ఇలాంటి విషయాలపై ప్రజల్లో చైతన్యం రావాలని కోర్టు అభిప్రాయపడింది.
అంతే తప్ప విధానపరమైన నిర్ణయాల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మహిళా బాక్సర్ మేరీకోమ్ వంటి క్రీడాకారిణిలు రాణించారని, ఆ స్ఫూర్తి అందరిలో కనిపించాలని కోర్టు అభిప్రాయపడింది. పిల్‌ను కోర్టు కొట్టి వేసింది.