దేశంలో హిందూ దేవాలయాలను ఆంక్షల మధ్యన తెరవడం పట్ల, అలాగే గణేష్ చతుర్థి ఉత్సవాలను సామూహికంగా మండపాల్లో చేయకపోవడం వల్ల.. బీజేపీ వాళ్లు చాలా బాధపడుతున్నారు. ఈ విషయంలో వారి ఆవేదన ఎంత చెప్పినా తక్కువే పాపం! బీజేపీ ప్రతిపక్షాల్లో ఒకటిగా ఉన్న చోట్ల, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న చోట కూడా ఈ బాధ తీవ్రంగా ఉంది! మరి ఇంత బాధపడిపోతున్న బీజేపీ నేతలకు సూటిగా ఒక సలహా ఏమిటంటే, ఈ విషయంలో ప్రధాన మంత్రి మోడీ చేత ఒక ప్రకటన చేయించేయొచ్చుగా!
దేశంలో సామూహిక మత కార్యక్రమాలన్నింటికీ గ్రీన్ సిగ్నల్ చేయాలని కేంద్రం చేత ఆదేశాలు ఇప్పించేయొచ్చుగా. ప్రధానమంత్రో, కేంద్ర హోం శాఖో ఈ విషయంలో బాధ్యత తీసుకోవచ్చు. కేంద్రం చెబితే రాష్ట్రాలు వింటాయా? అనే ప్రశ్నకు ఊసే లేదిక్కడ.
ఎందుకంటే.. గత ఏడాదిన్నరగా కోవిడ్ ప్రోటోకాల్స్ అంటూ కేంద్రం నెలకూ, పక్షం రోజులకూ వివిధ రకాల ఆదేశాలను ఇస్తూ ఉంది. ఏం తెరవాలి, ఏం మూయాలి, ఎలా ఎదుర్కొవాలి.. వంటి అంశాల గురించి కేంద్రం జాబితాలను వెలువరిస్తూ ఉంది. రాష్ట్రాలు ఎక్కడైనా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయంటే, అవి కేంద్రం వదిలేసిన అంశాల్లో మాత్రమే!
కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టిన ఏ అంశంలోనూ రాష్ట్రాలు స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. ఆంక్షల పరిధి నుంచి కేంద్రం వదిలేసిన అంశాల్లో మాత్రమే రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాయి. కాబట్టి.. ఒకరకంగా సర్వాధికారాలూ ఇప్పుడు కేంద్రం పరిధిలోనే ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు కేంద్రం జారీ చేసే కోవిడ్ ప్రోటోకాల్స్ లో.. మతపరమైన కార్యక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయండి, ఆంక్షలు పెట్టవద్దూ అంటే ఒక మాట చెబితే పోతుంది!
సరే మతం అంటే.. మళ్లీ ముస్లింలు, క్రిస్టియన్లు వచ్చేస్తారని బీజేపీయులకే బాధ కావొచ్చు. కనీసం వినాయక చతుర్థి మండపాలకు అయినా పర్మిషన్ ఇచ్చేయండి అని కేంద్రం చేత ఒక ప్రకటన చేస్తే పోతుంది కదా! కోవిడ్ ప్రోటోకాల్స్ ను కొన్నాళ్లు పక్కన పెట్టేయండి, వినాయకచవితి ఉత్సవాలకు అన్ని రకాల అనుమతులూ ఇచ్చేయండి అంటూ కేంద్రం చెప్పేస్తే గొడవే లేదిక. అప్పుడు రాష్ట్రాలు కూడా తడిగుడ్డ వేసుకుంటాయి.
అయితే కేంద్రం అలా చెప్పదు. మతపరమైన కార్యక్రమాలకు సమూహాలను ఏర్పడనీయకండి అంటుంది. ఎక్కడైనా కేసులు పెరుగుతున్నాయంటే అక్కడ ఎందుకు పెరుగుతున్నాయంటూ కేంద్ర కమిటీలు వస్తాయి. అయితే.. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న చోట మాత్రం రాజకీయం జరుగుతుంది. ఆంక్షలు, అనుమతులు అంటూ హద్దులేని రాజకీయం జరుగుతుంది.
బీజేపీకి కావాల్సింది వినాయక చవితి ఉత్సవాలు కాదు, వీటిని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందడం. ఉత్సవాలే కావాలంటే కేంద్రం చేత ఒక ప్రకటన చేయిస్తే అయిపోతుంది. అయితే అప్పుడు రాజకీయ ప్రయోజనాలు పొందడం సాధ్యం కాదు. అందుకే.. రచ్చ కావాలి, రచ్చ చేయాలి!