మెగాస్టార్ మెగా మూవీ.. సైరా. ఈ సినిమా విడుదల అక్టోబర్ 2 అని ఎప్పటి నుంచో తెలిసిన విషయం. అయితే ఇప్పుడు వున్నట్లుండి బాలీవుడ్ లో ఓ గ్యాసిప్ గుప్పుమంది. సైరా సినిమా ఓ వారం వెనక్కు వెళ్లి, అక్టోబర్ 8 లేదా 9న విడుదలయ్యే అవకాశం వుందన్నది ఆ గ్యాసిప్. ఈ మేరకు ట్వీట్ లు కూడా కనిపిస్తున్నాయి.
దీని అంతటికీ కారణం. బాలీవుడ్ లో మరో భారీ సినిమా 'వార్' అక్టోబర్ 2న విడుదల అవుతుండడమే. ఇప్పటికే వార్ సినిమా టీజర్, ట్రయిలర్ లు ఆ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసాయి. హృతిక్ రోషన్, టైగర్ షరాఫ్ ల కాంబినేషన్ లో తయారైన ఈ సినిమా మేకింగ్ చూస్తుంటే హాలీవుడ్ సినిమాలకు మించి వుంది.
ఇలాంటి సినిమాతో బాలీవుడ్ లో పోటీకి దిగితే సైరాకు నష్టం తప్పదు. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఓవర్ సీస్ వరకు ఒకె. కానీ పాన్ ఇండియా సినిమాగా సైరాను ప్రొజెక్ట్ చేస్తున్నారు. మార్కెట్ చేస్తున్నారు. దాని బడ్జెట్ కూడా అలాంటిదే. అందువల్ల వార్ సినిమాతో వార్ కన్నా, ఒకవారం వెనక్కు వెళ్లాలని సైరా మేకర్లు ఆలోచిస్తున్నారేమో? నిప్పులేకుండా పొగరాదుగా.