మెగాస్టార్ ఇంట్లో ఉత్సాహాతిరేకాలు పొంగి పొర్లుతున్నాయి. ఒకవైపు ఆయన నటించిన ‘సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’… విడుదలకు ముస్తాబు అవుతోంది. దానిమీద వారికి భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కు దక్కిన రెస్పాన్స్.. వారికి మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. మొన్ననే పుట్టినరోజు పండుగను కూడా మెగాస్టార్ చాలా ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు మరో శుభకార్యం వారి ఇంట జరిగింది. ఆ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా సతీసుత సమేతంగా హాజరయ్యారు.
మెగాస్టార్ తాతయ్య కావడం అనేది కొత్త సంగతి కాదు. ఎన్నడో అయిపోయారు. ఇప్పుడు ఆయన చిన్న కుమార్తె శ్రీజ మళ్లీ ఓ పండంటి కుమార్తెకు జన్మనిచ్చారు. ఆ శిశువు అన్నప్రాసన అందరు కుటుంబసభ్యుల మధ్య వారు చాలా వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రాంచరణ్ దంపతులు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ తదితరులతో పాటూ… పవన్ కల్యాణ్ కూడా కుటుంబసమేతంగా వెళ్లారు.
సాధారణంగా పవన్ కల్యాణ్ అన్నిరకాల వేడుకలకి అటెండ్ అయ్యేరకం కాదు. రాంచరణ్ పెళ్లిలో కూడా ఆయన చాలా సింపుల్ గానే భాగం పంచుకున్నారు. తను ఎంతో ప్రేమించే అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు నాడు మాత్రం ప్రతిసారీ సతీసమేతంగా ఇంటికివెళ్లి శుభాకాంక్షలు చెప్పి వస్తారు. ఇది ఆయన అలవాటు…
ఈసారి కూడా అన్నయ్యకు అదే రేంజిలో శుభాకాంక్షలు చెప్పారు. పైగా గతంకంటె భిన్నంగా.. అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి అభిమానులు నిర్వహించిన వేడుకకు తాను స్వయంగా హాజరై కేక్ కట్ చేశారు. ఇప్పుడు చిరంజీవి మనవరాలికి అన్నప్రాసన జరిగితే.. సహజంగానే సకుటుంబంగా వెళ్లారు.
కానీ దీని మీద నెటిజన్లలో సరదాగా కామెంట్లు వ్యాపిస్తున్నాయి. ఎవరినీ నొప్పించేవి కాకపోయినా.. కాస్త భిన్నంగా సరదాగా అనిపించేవి.. అదేంటంటే.. ‘‘చిరంజీవి “రెండో” కూతురు శ్రీజ, ఆమె “రెండో” భర్త కళ్యాణ్ దేవ్ దంపతుల కుమార్తె నవిష్క అన్నప్రాసనకి,
చిరంజీవి రెండో తమ్ముడు.. పవన్ కళ్యాణ్ తన “మూడవ” భార్య అన్నా లెజనోవా- పవన్ కళ్యాణ్ “నాలుగో” సంతానం మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి పాల్గొన్నారు..’’ అని పోస్టులు కనిపిస్తున్నాయి. అబద్ధమేమీ లేదుగానీ సరదాగా అనిపించే పోస్టులు ఇవి.