రాజ్యాంగ ధర్మాసనంలో ఏమౌతుంది?

ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి ఉదారవాదుల అభ్యంతరాలు.. ప్రస్తుతం న్యాయపీఠం ముందు చర్చకు వస్తున్నాయి. 370ని రద్దుచేసిన నాటినుంచి.. దేశంలో కొందరు దీనిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కేంద్రంలోని ప్రభుత్వం ఇలా ‘ఏకపక్షంగా’ ఆ ఆర్టికల్…

ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి ఉదారవాదుల అభ్యంతరాలు.. ప్రస్తుతం న్యాయపీఠం ముందు చర్చకు వస్తున్నాయి. 370ని రద్దుచేసిన నాటినుంచి.. దేశంలో కొందరు దీనిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కేంద్రంలోని ప్రభుత్వం ఇలా ‘ఏకపక్షంగా’ ఆ ఆర్టికల్ ను రద్దుచేయడం చెల్లుబాటు కాదని కొందరు వాదిస్తున్నారు. కాశ్మీరు ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని.. ఏ దేశంలో కలవాలో.. వారినే నిర్ణయించుకునేలా వదిలేయాలని కొందరు మాట్లాడుతున్నారు. కాశ్మీరును ప్రత్యేకదేశంగా విడిచిపెట్టేయాలని కూడా సలహాలిస్తున్నారు.

ఇలాంటి వారిలో కొందరు కోర్టు గడపతొక్కారు. ఒక సందర్భంలో అయితే.. 370 రద్దుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం ఒక ఫ్యాషన్ లాగా మారింది. అలాంటి మొక్కుబడి పిటిషన్లు దాఖలయ్యేసరికి సుప్రీం ధర్మాసనం ఘాటుగా చీవాట్లు వేసింది కూడా. కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారాన్ని కోర్టుకు వెళ్లేంత సీరియస్ గా తీసుకోలేదు. కోర్టుకు వెళ్లిన ఉదారవాదులు, మేధావుల అభ్యంతరాలు తాజాగా సుప్రీంలో విచారణకు వచ్చాయి. చాలా పిటిషన్లలోని డిమాండ్ మేరకు.. ఆర్టికల్ 370 రద్దు వ్యవహారాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడానికి సుప్రీం అంగీకరించింది.

ఈ మేరకు ఈ కేసును ప్రత్యేకంగా విచారించడానికి ఏర్పాటుచేసే రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరులో విచారణ ప్రారంభిస్తుందని సీజే ప్రకటించారు. ఈ ధర్మాసనానికి వెళుతున్నదంటేనే.. దాని అర్థం.. ఆ చర్యలో రాజ్యాంగాన్ని అతిక్రమించారనే ఫిర్యాదు ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. అలాంటి అంశమేదైనా ఉన్నదా అని బేరీజు వేసుకుంటే.. ఓ సంగతి అర్థమవుతోంది. ఈ 370ని అధికరణంలో జోక్యం చేసుకోదలచుకుంటే గనుక.. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే చేయాల్సి ఉంటుంది… అనే క్లాజ్ అందులో ఉంది.

భారత్ లో తాము భాగం కాదన్నట్టుగా.. తమకంటూ ఒక సొంతజెండా కూడా పెట్టేసుకుంటూ.. స్వాతంత్ర దినోత్సవం వచ్చినా.. భారత జెండా ఎగరేయకుండా.. ఇన్నాళ్లూ చెలరేగిన కాశ్మీర్ నాయకులు.. తమ ఇష్టంతో నిమిత్తం లేకుండా భారత ప్రభుత్వం ఎలాంటి సవరణకు నిర్ణయం తీసుకోకుండా పెట్టిన కండిషన్ అది. దానిని బట్టే రాజ్యాంగ ధర్మాసనం ఎదుట విచారణ జరగవచ్చు. అయితే.. ఇది విచారణలో నిలబడుతుందా లేదా అనేది సందేహమే.

ఎందుకంటే అక్కడ ఇప్పుడు ప్రజాప్రభుత్వం లేదు గానీ.. ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం గవర్నరు ఆధ్వర్యంలో నడుస్తోంది. వారినుంచి అనుమతి పొందిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్లుగా నిరూపించడం కేంద్రానికి కష్టం కాకపోవచ్చు. అందుచేతనే.. రాజ్యాంగ ధర్మాసనం ఎదుట వాదోపవాదాలు జరిగినప్పటికీ.. వాదనలు తీవ్రంగా సుదీర్ఘంగా సాగగలవే తప్పు.. 370 రద్దుకు ఎలాంటి ముప్పురాదని నిపుణులు భావిస్తున్నారు.

అమరావతిలో భూములు కొన్న నేతల హడల్!