‘అమరావతి రాజధాని’ అనే అంశం మీద చాలా చాలామాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేకించి భాజపా ఎంపీ సుజనాచౌదరి , మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య అయితే.. మాటల యుద్ధం వ్యక్తిగతంగా మారిపోయిందా అన్న రేంజిలో సాగుతోంది. బొత్స తన చిట్టా బయట పెట్టేసరికి.. మీడియా ముందుకు వచ్చి.. ఎడాపెడా ఎదురుదాడికి దిగాలని సుజనా చౌదరి అనుకున్నారు. ఇవాళ (బుధవారం) సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విలేకర్ల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే 3.40 గంటల సమయంలో దాన్ని రద్దు చేసుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ మీద ఎదురుదాడికి సిద్ధపడి, ప్రెస్ మీట్ కు ముహూర్తం కూడా నిర్ణయించిన తర్వాత.. దానికి 20నిమిషాల ముందు రద్దు చేసుకోవడం అనేది చిత్రమైన పరిణామమే. అలాగని ఎంపీ సుజనాచౌదరి విజయవాడలో అందుబాటులో లేకుండా.. ఎక్కడైనా దూరంగా ఉండిపోయారా అనుకోడానికి కూడా లేదు. ఆయన ఎంచక్కా.. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూనే ఉన్నారు. చివరికి ఆ ముంపు ప్రాంతాల సందర్శనలోనూ ఆయన మీడియాతో మాట్లాడారు గానీ.. రాజధాని విషయం మాత్రం ప్రస్తావించలేదు.
రాజధాని తరలించాలనే ఆలోచనను ప్రభుత్వం ప్రకటించకపోయినా.. అలా తరలిస్తే మహాపరాధమని, ప్రజాద్రోహమని అన్నట్లుగా సుజనా చౌదరి నిశిత విమర్శలు గుప్పించారు. తాను కేవలం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మాట్లాడుతున్నా అని అర్థం వచ్చేలాగా.. నాకు రాజధాని ప్రాంతంలో ఒక్క ఎకరం భూమి కూడా లేదు.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. దీనికి కౌంటర్ గా బొత్స మాట్లాడుతూ.. ఎవరికి భూములు ఉన్నాయో తనకు లెక్కలు తెలుసునని అన్నారు.
సవాళ్లు విసరితే బయటపెడ్తాం అన్నారు. దానికి ప్రతిగా సుజనా సవాలు విసిరారు. ఎన్ని వందల ఎకరాలు సుజనా బినామీ పేర్లమీద ఉన్నాయో.. ఆ లెక్కల చిట్టాలు బొత్స కూడా బయటపెట్టారు. దానికి కౌంటర్ గానే అన్నట్లుగా.. ఇవాళ సాయంత్రం సుజనా ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. కానీ అది చివరి నిమిషంలో రద్దయింది. బొత్స మాటలకు సుజనా వద్ద కౌంటర్ పాయింట్ లేదని.. మీడియా ముందుకు వస్తే.. మళ్లీ పరువు పోతుందని.. బినామీ ఆస్తుల యవ్వారాన్ని దాచడం సాధ్యంకాదని అర్థమైపోయి ఉంటుందని మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది.