డాలర్‌ బలపడిందా, రూపాయి పతనమయ్యిందా…?

ప్రపంచ మానవాళికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. కోవిడ్‌-19 విపత్తు పూర్తిగా సమసిపోక ముందే ఉక్రెయిన్-రష్యా యుద్ధం రావడం, యుద్ధం కొనసాగుతున్న వేళ డాలర్‌ విలువ పెరగడం (రూపాయి విలువ నేల చూపులు…

ప్రపంచ మానవాళికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. కోవిడ్‌-19 విపత్తు పూర్తిగా సమసిపోక ముందే ఉక్రెయిన్-రష్యా యుద్ధం రావడం, యుద్ధం కొనసాగుతున్న వేళ డాలర్‌ విలువ పెరగడం (రూపాయి విలువ నేల చూపులు చూడడం) వెంట వెంటనే జరిగి పోతున్నాయి. ఈ మూడు సంక్షోభాలతో మానవాళి అనేక అవస్థలను పడుతున్నది. ఇలాంటి విపత్తులను అనుభవిస్తున్న ప్రపంచ మానవాళి జీవనశైలి సమూల మార్పులకు లోనవుతున్నది.

కరోనా కల్లోల అలలు:

కరోనా విజృంభణతో వ్యక్తుల నుంచి వ్యవస్థల వరకు, కుటుంబం నుంచి సమాజం వరకు, దేశం నుంచి ప్రపంచ దేశాల వరకు మానవ జీవనశైలి కుదుపులకు లోనైంది. ప్రపంచ దేశాలు ఆర్థిక, సామాజిక, సంస్కృతికి మార్పులతో అతలాకుతలం అయ్యింది. కొడుక్కు తల్లితండ్రులు, తాతకు మనుమడు, మనిషికి మనిషే శత్రువన్నట్లు భౌతిక దూరాల అనివార్యత ఏర్పడింది. కుటుంబ ఆదాయం కరగడం, ఉద్యోగ ఉపాధులు ఊడడం, వేతనాల్లో తీవ్ర కోతల వాతలు పడడం, విద్యాలయాలకు తాళాలు పడడం, లాక్‌డైన్‌ నియమాలతో ఇంటికి పరిమితం కావడం, పరిశ్రమలు మూతపడడం, ఎగుమతి దిగుమతులు తరగడం లాంటి అనేక అవాంతరాల నడుమ మానవ జీవితాలు అత్యంత ప్రమాదకరంగా మారడం చూసాం, అనుభవించాం. 

కరోనా విపత్తుతో ప్రపంచ సగటు జిడిపీ 3.4 శాతం వరకు పడిపోవడంతో ఆర్థిక మాంద్యం గమనించాం. కోవిడ్‌ కోరల్లో చిక్కి 214 మిలియన్ల ఉద్యోగాలు పోవడం, అందులో 62 మిలియన్ల పర్యాటరంగ ఉద్యోగాలు పోవడం జరిగింది. కరోనా విపత్తుతో 7 శాతం వరకు ప్రపంచ వాణిజ్యం తగ్గడం, 25 శాతం వ్యాపార రెవెన్యూ పడిపోవడం, 11 శాతం శ్రామికులు ఉపాధులు కోల్పోవడం, 4 శాతం వ్యాపారాలు నష్టాలతో మూత పడడం, 55 శాతం వ్యాపారాలు ప్రభావితం కావడం జరిగిపోయింది. 

దెబ్బ మీద దెబ్బ : ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం:

గోరుచుట్టుపై రోకలి పోటులా కోవిడ్‌-19 అలలు కరుగుతున్నాయని మనిషి మహా ఊరట చెందుతున్న తరుణంలో మరో పిడుగు లాంటి ఉక్రెయిన్‌పై రష్యా మూకుమ్మడి దాడి ప్రచండ యుద్ధంగా గత 8 నెలలుగా కోనసాగుతున్నది. కరోనా కాటు నుంచి తేరుకోక ముందే దెబ్బ మీద దెబ్బలా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం నేడు ప్రపంచ దేశాల నలుమూలల ఉన్న మానవాళి సాధారణ జీవనాన్ని ప్రమాదంలోకి నెట్టింది. 

ఉక్రెయిన్‌ రష్యా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు, వంట నూనెలు, ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకుల ధరలు చుక్కలను తాకడం, స్టాక్‌మార్కెట్‌ కుదుపులతో ద్రవ్యోర్బణం పెరగడం, దేశ ఆర్థిక మాంద్యాలకు లోనుకావడం జరుగుతోంది. ఈ యుద్ధంతో ప్రత్యక్షంగా మారణహోమం, క్షతగాత్రుల ఆక్రందనాలు, బారులు తీరిన మిలియన్ల వలసలు, పర్యావరణ విధ్వంసాలు, మౌళిక వసతుల నష్టాలు, మానవాళి సంక్షోభాలు పుట్టుకొచ్చాయి. 

రూపాయి విలువ పతనం:

మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు కరోనా విపత్తు, యుద్ధ విధ్వంస దుష్ఫలితాల నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్న గడియల్లో నేడు డాలర్‌ విలువతో పోల్చితే భారత రూపాయి విలువ విపణి వీధుల్లో ఆసాంతం పడిపోవడంతో భారతం మరో ప్రమాదకర కుదుపులకు గురవుతున్నది. 

అమెరికన్‌ డాలర్‌ విలువ పెరుగుతున్న వేళ ప్రపంచ దేశాల కరెన్సీ విలువలు తరుగుతుండడం జరుగుతున్నది. డాలర్‌ విలువ బలపడడంతో ఇండియన్‌ రూపాయి విలువ కుచించుకుపోతూ నేడు ఒక డాలర్‌కు రూపాయి‌ విలువ 82.00కు పైగా వరకు పతనం కావడం చూస్తున్నాం. అమెరికన్‌ డాలర్‌ విలువ పెరగడానికి కారణాలుగా పెరిగిన అమెరికల్‌ వడ్డీ రేట్లు, అంతర్జాతీయంగా శక్తి వాణిజ్య/వ్యాపారాలు, యూయస్‌లో పెట్టుబడుల కోసం విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు, అమెరికాలో పెట్టుబడులు పెరగడం లాంటి పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు. 

పలు దేశాల కరెన్సీ పతనాలు:

డాలర్‌ విలువ దినదినం పైపైకి పాకడంతో భారత్‌తో పాటు ప్రపంచ దేశాల కరెన్సీలన్నీ పాతాళం వైపు చూడడం గమనిస్తున్నాం. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి పూర్వం 24 ఫిబ్రవరి 2022న డాలర్‌ మారకం విలువ 74.64 రూపాయలు ఉండగా గత 8 మాసాల్లో 17 అక్టోబర్ 2022‌ రోజున ₹ 82.29 వరకు విలువ పతనం కావడంతో రూపాయి విలువ 9 శాతం వరకు పడిపోవడం గమనిస్తున్నాం. రూపాయి పతనంతో పోల్చితే ఇతర దేశాల కరెన్సీలు అధికంగా ప్రభావితం అయ్యాయని వివరాలు తెలుపుతున్నాయి. ఫిబ్రవరి 2022లో ఒక డాలర్‌ మారక విలువగా 0.89 యూరోలు ఉండగా 17 అక్టోబర్‌న 1.03 యూరోలకు పతనంతో 17 శాతానికి యూరో విలువ దిగజారడం గమనించాం. 

గత 24 ఫిబ్రవరి 2022న ఒక డాలర్‌ విలువ 0.75 జిబిపీ (బ్రిటన్‌ పౌండు)లు ఉండగా 17 అక్టోబర్‌ రోజున 17 శాతం పడిపోయి 0.89కు చేరింది. గత ఫిబ్రవరి-2022లో ఒక డాలర్‌కు సమానంగా 6.33 చైనీస్‌ యాన్‌ ఉండగా 17 అక్టోబర్‌న 7.2కు పడిపోయింది. ఆస్ట్రేలియన్‌ డాలర్‌ విలువ 1.40 నుంచి 1.60 వరకు, అనగా 14 శాతం పడిపోవడం గమనించాం. సింపూర్‌ డాలర్‌ విలువ గత ఫిబ్రవరిలో 1.36 ఉండగా అక్టోబర్‌లో 1.43 వరకు తగ్గి 5 శాతం పతనం అయ్యిందని విధితమవుతున్నది.

రూపాయి పతనం అతి నష్టదాయకం:

గత 8 నెలల్లో (24‌ ఫిబ్రవరి నుంచి 17 అక్టోబర్ 2022 వరకు)యూయస్‌ డాలర్‌ విలువతో పోల్చితే భారత రూపాయి 9 శాతం పతనం చెందగా, యూరో/పౌండు 17 శాతం, చైనీస్‌ యాన్‌ 7.2 శాతం, ఆస్ట్రేలియన్‌ డాలర్‌ 14 శాతం, సింగపూర్‌ డాలర్‌ 5 శాతం వరకు పతనం కావడం గమనించారు. పలు దేశాల కరెన్సీలతో పోల్చితే ఇండియన్‌ రుపీ విలువ స్థిరంగా ఉండడం, భారత ప్రభుత్వంతో పాటు రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న సత్వర చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని అవగతం అవుతున్నది. 

డాలర్‌ విలువ పెరిగినా, రూపాయి విలువ తగ్గినా నష్టం మాత్రం మనకే అని అర్థం చేసుకోవాలి. రూపాయి విలువ పతనం వల్ల దిగుమతులకు డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకు అధిక నష్టం జరుగుతుందని గమనించాలి. ముళ్లు ఆకు మీద పడ్డా, ఆకు ముళ్లు మీద పడినా నష్టం ఆకుదే అని భావించాలి. డాలర్‌ విలువ పెరిగినా, రూపాయి విలువ తరిగినా నష్టం రూపాయికే అవుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రూపాయి విలువ 100 వరకు తగ్గినా ఆశ్చర్య పడవలసిన పని లేదని హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ దేశాల్లో డాలర్‌తో పోల్చితే అతి తక్కువ విలువ కలిగిన కరెన్సీలుగా ఇరానియన్‌ రియాల్ (1 డాలర్‌ = 42,400 రియాల్స్‌‌)‌, వియత్నమీస్‌ డోంగ్‌, లావో, ఇండొనేషియన్‌ రుపయ్యా, సిరియా లియోన్‌, యుజ్‌బెక్‌ సమ్‌, గ్వీనియా ఫ్రాంక్‌, పెరాగ్విన్‌ గ్వరానీ, కొలంబియన్‌ పెసో, కాంబోడియన్‌ రియాల్‌(1 యూయస్‌ డాలర్‌ = 4,084 రియాల్‌)లు ఉన్నాయని గమనించాలి. రూపాయి విలువ పతనం కావడాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తూ, అవసర చర్యలను తీసుకుంటూ రూపాయి విలువకు అంతర్జాతీయ వేదికలో పట్టం కట్టావని కోరుకుందాం. 

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి