టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా విమర్శలు చేయడానికి ముందు వరుసలో ఉంటారు. బహుశా లోకేశ్‌ను రోజా తిట్టినంతగా మరే ప్రత్యర్థి నోరు పారేసుకుని ఉండరేమో. తాజాగా తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్న రోజా…ఏడు కొండలపై కూడా లోకేశ్‌ను విడిచిపెట్టలేదు.
‘తిన్నది అరగక పనీపాట లేకుండా లోకేశ్ అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఏ పనీ లేకపోవడంతో లోకేశ్ పబ్జీ ఆడుకుం టున్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని దద్దమ్మ లోకేశ్. అలాంటి నాయకుడు…151 సీట్లతో తిరుగులేని ఆధిక్యతతో నాయకుడిగా ఎదిగిన జగన్‌పై విమర్శలు చేయడం హాస్యాస్పదం. కరోనా సమయంలో దొంగల్లా పారిపోయి మేము బతికుంటే చాలు అన్నట్లు వ్యవహరించారు. టీడీపీలో ఉన్న అవినీతి గద్దలు సాక్ష్యాలతో సహా దొరికి అరెస్ట్ అయితే వారి కోసం హైదరాబాద్ నుంచి వచ్చారు’ అంటూ రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అలాగే దేశంలోనే బెస్ట్ సీఎంగా జగన్ నాల్గో స్థానంలో నిలిచారని రోజా ప్రశంసలతో ముంచెత్తారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే హామీలను అమలు చేసిన ఏకైక నేత జగన్ అని రోజా అన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో జగన్ ముందు చూపు ఆదర్శనీయమన్నారు. కరోనా జబ్బును ఆరోగ్యశ్రీ కిందికి తెచ్చి బాధితులకు ఉచిత వైద్యం అందిస్తూ దేశంలోనే ఏపీ మొదటి వరుసలో ఉందని రోజా ప్రశంసించారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న సీఎంపై లోకేశ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నారా లోకేశ్ ముందుగా రాజకీయాలపై అవగాహన తెచ్చుకుని మాట్లాడాలని రోజా హితవు పలికారు. మొత్తానికి రోజా తిట్లను వింటే మాత్రం లోకేశ్ ఏం కావాలి?