కార్నర్ సుజనా : కమల వర్గాల్లో పండగ!

తెలుగుదేశం నుంచి సుజనాచౌదరి సహా నలుగురు రాజ్యసభ ఎంపీలు తమ పార్టీలోకి వచ్చి చేరడాన్ని కమలనాయకులు ఎంతమేరకు జీర్ణించుకున్నారు. వచ్చిన నాటినుంచి.. ఆర్థికంగా తమకంటె సంపన్నులు గనుక.. పార్టీ మీద ఆధిపత్యాన్ని ఈ కొత్త…

తెలుగుదేశం నుంచి సుజనాచౌదరి సహా నలుగురు రాజ్యసభ ఎంపీలు తమ పార్టీలోకి వచ్చి చేరడాన్ని కమలనాయకులు ఎంతమేరకు జీర్ణించుకున్నారు. వచ్చిన నాటినుంచి.. ఆర్థికంగా తమకంటె సంపన్నులు గనుక.. పార్టీ మీద ఆధిపత్యాన్ని ఈ కొత్త వలసనాయకులు సొంతం చేసేసుకుంటూ ఉంటే.. వారు ఎలా ఫీలవుతున్నారు. దానికి సంబంధించిన చర్చలు భాజపా వర్గాల్లో కొన్ని రోజులుగా ఉన్నాయి. వాటికి సంబంధించిన సంకేతాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో సుజనా చౌదరి బినామీ ఆస్తుల చిట్టా బయటకు రావడంతో.. పార్టీలో కొందరు గళం విప్పుతున్నారు.

అమరావతి రాజధానిని అక్కడినుంచి పూర్తిగా తరలించడాన్ని భాజపా సూత్రప్రాయంగా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీలోని అందరూ కూడా ఈ విషయంలో ఒక్కమాట మీదే ఉన్నారు. ఒక ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి.. ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత.. కొన్ని నిర్మాణాలను ప్రారంభించిన తర్వాత.. ఇప్పుడు మరో ప్రభుత్వం వచ్చి రాజధానిని మార్చేస్తాం అంటూ చేసే ప్రయత్నాలు సమర్థనీయం కాదని వారు అంటున్నారు. అయితే ఈ విషయంలో ఇతర నాయకులు మాట్లాడుతున్న తీరుకు, సుజనాచౌదరి తీరుకు తేడా ఉంది. ఆయన ఇంకా తెలుగుదేశంలోనే ఉన్నట్లుగా.. ఎడాపెడా విమర్శలు చేసేశారు.

దీనికి జవాబుగా.. సుజనాచౌదరికి బినామీ పేర్లమీద.. అమరావతి ప్రాంతంలో ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయో… బొత్స సత్యానారాయణ చిట్టా విప్పారు. ఇంకా ఉంది లెక్క తేలుస్తాం అని కూడా అన్నారు. దీంతో ఇప్పుడు భాజపా నాయకుల్లో ఒక వర్గానికి, హేపీగానే ఉంది. సుజనా ఇలాంటి ఆరోపణల్లో చిక్కుకోవడం వల్ల.. ఆయన ప్రాభవం తమను మించి పోదనే ఉద్దేశంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.

విష్ణుకుమార్ రాజు విషయానికి వస్తే.. అమరావతి నుంచి రాజధాని తరలింపు అసాధ్యమని, రైతులకు ఆందోళన అక్కర్లేదని, తాము అండగా ఉంటామని అంటూనే… ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే దాన్ని నిరూపించవచ్చునని, అవినీతిని తామెవ్వరూ సహించమని వక్కాణిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా సుజనాకు చుట్టుకునేవే. మరి బయటినుంచి వస్తున్న దాడిని.. లోపలినుంచి కూడా మద్దతు లేకపోతే.. సుజనా ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

అమరావతిలో భూములు కొన్న నేతల హడల్!