బీజేపీలో మంత్రి పదవుల చిచ్చు.. ఎన్ని నెలలో!

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా భారతీయ జనతా పార్టీలో పెద్దగా ఉత్సాహం కనపడటం లేదని అంటున్నారు పరిశీలకులు. ప్రభుత్వం ఏర్పాటు అయిన నెలకు కానీ కేబినెట్ ఏర్పాటు విషయం ఒక కొలిక్కి రాలేదు. అన్నిరోజులు…

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా భారతీయ జనతా పార్టీలో పెద్దగా ఉత్సాహం కనపడటం లేదని అంటున్నారు పరిశీలకులు. ప్రభుత్వం ఏర్పాటు అయిన నెలకు కానీ కేబినెట్ ఏర్పాటు విషయం ఒక కొలిక్కి రాలేదు. అన్నిరోజులు ముఖ్యమంత్రి మాత్రమే ఉన్నారు. చివరకు ఎలాగో మంత్రి పదవులు ఇచ్చుకున్నారు.

అయితే ఆ పదవులు దక్కినవారూ అసంతృప్తికే లోనవుతున్నారు. పదవులు దక్కని వారి సంగతి సరేసరి. ముగ్గురు డిప్యూటీ సీఎంల నియామకం జరిగినా, ఇంకా తమకు ఆ హోదా దక్కలేదు అని నిరసన వ్యక్తంచేస్తున్న వారున్నారక్కడ. గాలి జనార్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీరాములుకు డిప్యూటీ సీఎం పదవి దక్కలేదు. దీంతో ఆయన వర్గం నుంచి అసహనం వ్యక్తంఅవుతూ ఉంది. శ్రీరాములు మందీమార్బలం రోడ్డు ఎక్కడి తమ నేతకు డిప్యూటీసీఎం పదవి ఇవ్వలేదని నిరసన గళం వినిపిస్తూ ఉన్నారు.

ముగ్గురు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం పట్ల ప్రత్యర్థులు ఎద్దేవాచేస్తూ ఉన్నారు. ఇక నాలుగో డిప్యూటీ సీఎం పదవి కోసం ఇలా రోడ్డు ఎక్కుతున్నారు కమలం పార్టీ వాళ్లు. ఇక మంత్రి పదవులు దక్కినివారు కూడా అదేస్థాయి అసంతృప్తితో ఉన్నారు. అసహనం వ్యక్తంచేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేగా నెగ్గని వారికే మంత్రి పదవిని ఇచ్చి, డిప్యూటీ సీఎం హోదాను ఇచ్చారని.. అలాంటిది ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారికి మాత్రం అవకాశం ఇవ్వడం లేదనివారు వాపోతున్నారు.

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల్లో తొమ్మిది మంది రెడ్లు ఉంటే ఒక్కరికి కూడా మంత్రిపదవి ఇవ్వలేదని ఆ వర్గంవారు వాపోతున్నారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత రామలింగారెడ్డి కూడా స్పందించేశారు! కాంగ్రెస్-జేడీఎస్ సర్కారులో రెడ్లకు మంత్రి పదవులు దక్కాయని. బీజేపీ మాత్రం రెడ్లను అస్సలు పట్టించుకోవడం లేదని రామలింగారెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ మంత్రివర్గ ఏర్పాటే డొల్లగా ఉందని ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోతుందని కాంగ్రెస్-జేడీఎస్ నేతలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

అమరావతిలో భూములు కొన్న నేతల హడల్!