సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు, మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశాలు.. ఇలాంటి అంశాలను ఢిల్లీ నుంచి శాసిస్తుంది అనే పేరుండేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. సోనియాగాంధీ అలా తన కనుసన్నల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను నడిపించిందనే పేరును తెచ్చుకున్నారు. ఇందిర హయాం నుంచినే కాంగ్రెస్ కు ఆ ఇమేజ్ ఉందనేది కూడా వేరే చెప్పనక్కర్లేదు.
విశేషం ఏమిటంటే.. కాంగ్రెస్ హైకమాండ్ లక్షణాలనే పుణికిపుచ్చుకుంటున్నట్టుగా ఉంది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. దేశంలో తనకు తిరుగులేదనుకున్నప్పుడు రాష్ట్రస్థాయి నేతలను డమ్మీలుగా చేసి వ్యవహారాలను నడిపించింది కాంగ్రెస్ హై కమాండ్. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ తీరు కూడా దాదాపు అలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. కర్ణాటక వ్యవహారాలను గమనిస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.
కర్ణాటకలో మంత్రుల్లో ఎవరికి ఏ శాఖలు కేటాయించాలో కూడా ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే జరిగిందనే టాక్ వినిపిస్తూ ఉంది. మంత్రివర్గంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదనే అంశాలను ఢిల్లీనే డిసైడ్ చేసిందంటారు. మంత్రివర్గ ఏర్పాటు కోసమే యడియూరప్ప పలుసార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చిందట. చివరకు ఢిల్లీ నుంచి లిస్టును తెచ్చి వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇక శాఖల కేటాయింపు కూడా ఢిల్లీ ఆదేశాల మేరకే జరిగిందని చెవులు కొరుక్కుంటున్నారు కర్ణాటక రాజకీయ నేతలు. ముగ్గురు డిప్యూటీ సీఎంలు కూడా అధిష్టానం ఆలోచనే అని, యడియూరప్ప అధికారాలను పూర్తిగా పరిమితం చేసేందుకు బీజేపీ హైకమాండ్ ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. తమకు దక్కిన శాఖల విషయంలో కొందరు మంత్రులు అసంతృప్తిగా ఉన్నారట. అయితే అంతా అధిష్టానం ఆదేశాలే కాబట్టి ఎవ్వరూ కిక్కురుమనడం లేదని భోగట్టా.
మరి కర్ణాటకలో అంటే మెజారిటీ బోటాబోటీగా ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతోనే అంతా ఢిల్లీ ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తున్నారా.. లేక ఇక నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ వ్యవహారాలు ఇలానే ఉంటాయా? అనేది ముందు ముందు క్లారిటీ వచ్చే అంశమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.