చివరకు వారు చెప్పినా సర్కారుజోరు తగ్గట్లేదు!

సాధారణంగా అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్! అలాగే డబ్బు మొత్తం పెడుతున్నది కేంద్ర ప్రభుత్వమే గనుక.. వారు లేవదీసిన అభ్యంతరాలే ఫైనల్!! అయితే తాము నమ్మిన పద్ధతిని అనుసరించడంలో.. ఏపీలోని జగన్ సర్కారు..…

సాధారణంగా అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్! అలాగే డబ్బు మొత్తం పెడుతున్నది కేంద్ర ప్రభుత్వమే గనుక.. వారు లేవదీసిన అభ్యంతరాలే ఫైనల్!! అయితే తాము నమ్మిన పద్ధతిని అనుసరించడంలో.. ఏపీలోని జగన్ సర్కారు.. ఇలాంటివి ఏవీ పట్టించుకునే స్థితిలో లేదు. తాము నమ్మిన విషయాన్ని అవతలివారు కూడా నమ్మేలా చేయాలని, నమ్మేవరకు ప్రయత్నించాలనే ధోరణిలోనే వారు వెళుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో ప్రభుత్వం మడమ తిప్పకపోవడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

పోలవరం ప్రాజెక్టు విషయంలో పాత ప్రభుత్వం కాంట్రాక్టర్లనుంచి భారీగా అవినీతికి పాల్పడిందనే ఉద్దేశంతో ప్రభుత్వం.. కాంట్రాక్టులను రద్దుచేసింది. రద్దయిన ఒప్పందాలు రెండు విధాలైనవి. ఒకటి పోలవరం ప్రధాన డ్యామ్ కు సంబంధించినది అయితే.. రెండోది.. జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినది. ఈ రెండు రకాల పనులకు కూడా కొత్తగా మళ్లీ రీటెండర్లు పిలవడానికి కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబరు 1 నాటికి మళ్లీ నిర్మాణ పనులు మొదలుపెట్టాలనే ఉద్దేశంతోనే.. వెంటనే నోటిఫికేషన్ ఇచ్చారు.

అయితే ఈ రెండువిధాల కాంట్రాక్టుల రద్దు కూడా చికాకులు తప్పడంలేదు. విద్యుత్తు ప్రాజెక్టు విషయంలో నిర్మాణ సంస్థ నవయుగ కోర్టును ఆశ్రయించిన తర్వాత వారికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఈ విషయంలో కాంట్రాక్టు రద్దుచేసే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదని, రీటెండరింగ్ ప్రక్రియ ఆపేయాలని, నవయుగ వారే పనులు కొనసాగించేలా చూడాలని హైకోర్టు తీర్పు చెప్పేసింది. మరోవైపు ప్రధానడ్యామ్ పనులకు సంబంధించి.. కాంట్రాక్టరు మారితే వ్యయం పెరుగుతుంది, డిజైన్లు మారితే నాణ్యత ప్రశ్నార్థకం అవుతుంది.. అంటూ కేంద్రం అభ్యంతరాలు లేవనెత్తింది.

రెండు నిర్ణయాలకూ ఎదురుదెబ్బ తప్పకపోయే సరికి.. జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. తాము మాత్రం అనుకున్న చందంగా ముందుకు దూసుకువెళ్లాలనే నిర్ణయంతోనే జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. జగన్ ఢిల్లీలో మంత్రి షెకావత్ ను కలిసి పరిస్థితి వివరించారు. ప్రధాన డ్యాం నిర్మాణానికి రీటెండర్ల విషయంలో ఆటంకాలు లేకుండాచూడాలని కోరారు. ఆయనను తమ నిర్ణయాలకు అనుకూలంగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు.

మరోవైపు విద్యుత్తు ప్రాజెక్టు విషయంలో.. జెన్‌కో మళ్లీ హైకోర్టునే ఆశ్రయించింది. మధ్యంతర ఉత్తర్వుల్ని కొట్టేయాలని కోరుతోంది. ఈ విషయంలో నవయుగ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కు విచారణార్హతే లేదని వాదిస్తోంది. జగన్ రెండురోజుల కిందట జెన్‌కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. కోర్టులో ప్రభుత్వం వాదనను మరింత సమర్థంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు రకాలుగానూ అనుకున్నట్లుగా ముందుకెళ్లడానికే జగన్ సర్కారు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈమె హీరోయిన్.. ఇతను హీరో కమ్ విలన్..