ఆల్ ఇండియా స్టార్ గా ప్రభాస్ అవతరించాడు. ఈ స్టార్ డమ్ నిలబడుతుందా? లేదా అన్నది సాహో ఫలితం చెబుతుంది. అయితే ఇంత స్టార్ డమ్ తెచ్చుకున్నందున ప్రభాస్ రెమ్యూనిరేషన్ ఎంత వుంటంది? కానీ ఈ ప్రశ్నకు ఇప్పడు సమాధానం లేదు. ఎందుకంటే బాహుబలి రెండుభాగాలు కలిపి ప్రభాస్ కు ఇచ్చింది 12 కోట్లే. ఎవరు అంగీకరించకున్నా, ప్రభాస్ సన్నిహిత వర్గాలకు తెలిసిన నిజం ఇదే.
సాహో అన్నది ప్రభాస్ హోమ్ బ్యానర్ సినిమా. లెక్కల్లో రాసుకోవడం, చూసుకోవడం అన్నది వాళ్ల ఇష్టం. అందువల్ల అది కూడా లెక్కలోకి తీసుకోవడానికి లేదు. సో, సాహో హిట్ తరువాతే ప్రభాస్ అసలు సిసలు రెమ్యూనిరేషన్ అన్నది ఫిక్స్ అవుతుంది.
ప్రస్తుతానికి తెలుగులో మహేష్ బాబు టాప్ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు. యాభై కోట్ల్ వర్త్ అయిన నాన్ థియేటర్ హక్కులు తీసుకుంటున్నారు. మిగిలినవారు అంత తీసుకోవడం లేదు. బన్నీ లెక్క పాతిక కోట్ల వరకు వుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ లెక్క దానికి మరికాస్త పైనే. సైరా కోసం రెమ్యూనిరేషన్ ఎంతరాసినా, అది మెగాస్టార్ స్వంత సినిమా కనుక లెక్కలోకి తీసుకోవడానికి లేదు.
సాహో సినిమా కనుక ఇండియా వైడ్ గా హిట్ అయి, మూడు వందల కోట్లు కనుక వసూలు చేస్తే, ప్రభాస్ రెమ్యూనిరేషన్ ఎక్కడో వుంటుంది. ఎవరైనా సినిమా తీస్తే, ఆల్ ఇండియా, వరల్డ్ రైట్స్ వాళ్లకు వదిలేసి, తెలుగు హక్కులు మాత్రం తను వుంచుకునే రేంజ్ కు వెళ్లినా ఆశ్చర్యంలేదు. అప్పుడు ఆ రేంజ్ ను అందుకోవడం ఇప్పుడు వున్న స్టార్స్ కు కాస్త కష్టమే.
కానీ ఇదంతా కూడా సాహో ఫలితాన్ని బట్టే. సాహో ఏ రేంజ్ హిట్ అన్నది, ఏ రేంజ్ వసూళ్లు సాగిస్తుందన్నది తెలిసిన తరువాతనే ప్రభాస్ రేంజ్ ఏమిటన్నది ఓ అయిడియా వస్తుంది.