రెండుదేశాల మధ్య ఉండే వివాదాన్ని అంతర్జాతీయ వివాదంగా మార్చాలని, అన్నిదేశాలూ ఇందులో జోక్యంచేసుకునేలా ప్రేరేపించి.. తాము వారి సానుభూతిని పొందాలని.. పాకిస్తాన్ ఎన్నెన్ని కుయత్నాలకు తెగబడుతోందో అందరికీ తెలుసు. ఆర్టికల్ 370ని రద్దుచేసిన నాటినుంచి.. ఇప్పటిదాకా ఈ అంశంపై పాక్ చేయని రగడలేదు. తాజాగా జి7 దేశాల వేదిక నుంచి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా.. ఈ సమస్య ద్వైపాక్షికం మాత్రమేనని ప్రకటించడం మోడీ సాధించిన విజయంగా పలువురు అభివర్ణిస్తున్నారు.
అమెరికా కాశ్మీర్ సమస్యలో జోక్యం చేసుకోవాలనేది.. అలా జరిగితే.. భారత్ మీద లెక్కకు మిక్కిలిగా పితూరీలో చెప్పాలనేది పాక్ కోరిక. వారు తొలినుంచి ఈ ఎజెండాకు తగ్గట్లుగానే మాటలు సంధిస్తున్నారు. ఐరాస దృష్టికి తీసుకెళ్లినా, చైనా ద్వారా కాశ్మీర్ అంశంపై సమావేశం జరిగేలా చేయగలిగినా.. సమావేశం జరిగే ముందురోజున అమెరికాలోని ట్రంప్ తో, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడినా.. ఇవన్నీ కూడా.. దీనిని అంతర్జాతీయ అంశంగా తయారుచేయాలనే లక్ష్యంతో చేసినవే. అయితే ఏ రకంగానూ వారికి ఆశించినంత మద్దతు దక్కడంలేదు.
ట్రంప్ తొలుత పాక్ వాదనకు కొంత తలొగ్గినట్లే కనిపించారు. అవసరమైతే ఈ విషయంలో తాను మధ్యవర్తిత్వం చేస్తానని కొన్నిసార్లు ప్రకటించారు. జి7 దేశాల సదస్సు సందర్భంగా మోడీతో మాట్లాడుతానని కూడా అన్నారు. ఫ్రాన్స్‌లోని బియరజ్లో ఈ సదస్సు సందర్భంగా ట్రంప్-మోడీ విడిగా సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఉమ్మడిగా ప్రెస్ మీట్ నిర్వహించారు. కాశ్మీర్ సమస్యను భారత్-పాక్ లు ద్వైపాక్షికంగా చర్చించి పరిష్కరించుకుంటాయని మోడీ చెప్పారు. ఈ విషయంలో మూడోపక్షం మధ్యవర్తిత్వానికి ఆస్కారం లేదని కూడా ట్రంప్ ముందే ప్రకటించారు. దానిని ట్రంప్ సమర్థించారు. ‘ఆ సమస్యను వారే పరిష్కరించుకోగలరని అనుకుంటున్నా’ అంటూ ట్రంప్ అనడం విశేషం. ఖచ్చితంగా ఈ మాటలు పాకిస్తాన్‌కు అశనిపాతమే.
దీనిని అంతా భారత్ సాధించిన దౌత్య విజయంగా అభివర్ణిస్తున్నారు. నిజానికి ఇది ప్రధాని నరేంద్రమోడీ ‘లౌక్యవిజయం’ లాగా కనిపిస్తోంది. ఈ విషయంలో మూడోజోక్యం అనవసరం అనే మాటలను మోడీ వాడకుండా… ‘మూడో దేశాన్ని మేం ఇబ్బంది పెట్టదలచుకోలేదు’ అంటూ లౌక్యంగా సెలవిచ్చి.. ట్రంప్ మద్దతు పొందగలిగారు. సమస్య ద్వైపాక్షికమేనని ట్రంప్ ను ఒప్పించడం, అంతర్జాతీయంగా భారత్‌కు కలిసివచ్చే అంశం అవుతుంది.