రాహుల్ ప్రస్తుతం భారత్ జోడో అంటూ సుదీర్ఘమైన పాదయాత్ర సాగిస్తున్నారు. దారమ్మట వచ్చే ప్రజలను కలుస్తున్నారు. కుదిరినచోట్ల బహిరంగ సభలు పెడుతున్నారు. మధ్యమధ్యలో బ్రేక్ తీసుకుని ఢిల్లీ కూడా వెళ్లి వస్తున్నారు.మొత్తానికి ఏదోలా యాత్ర సాగుతోంది. సహజంగానే ఇలాంటి యాత్రల్లో.. ఏ ఊరిలో అడుగుపెడితే, ఏ రాష్ట్రంలో అడుగుపెడితే.. అక్కడి ప్రజలను సంతుష్టుల్ని చేసేలా హామీలు కురిపించడం రివాజు.
ఏ రోటికాడ ఆ పాట పాడినట్టుగా ఏదోటి చెప్పి మెప్పించాల్సిందే. ఆ క్రమంలోనే ఏపీలో అడుగుపెట్టినప్పుడు తాము అధికారంలోకి రాగానే ప్రత్యేకహోదా ఇచ్చేస్తామని, పోలవరం కట్టేస్తామని కూడా రాహుల్ కొన్ని పసలేని హామీలు గుప్పించారు.
తాజాగా ఆయన పర్యటన తెలంగాణలో సాగుతోంది.ఇక్కడ మళ్లీ అదే తరహాలోని పసలేని, తలాతోకాలేని హామీలను రాహుల్ కురిపిస్తున్నారు. అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలు రద్దు చేస్తామని, రైతులకు అండగా నిలుస్తామని రకరకాల మాటలను చెబుతున్నారు. అయితే ఇవన్నీ మెలికలతో కూడిన హామీలు అనే సంగతి ప్రజలు గుర్తించాలి.
తాము అధికారంలోకి వస్తే అనగా.. రాహుల్ ఉద్దేశం ఏమిటి? అధికారంలో వారు ఉంటే సరిపోతుందా? లేదా, ఇతర పార్టీల పొత్తులు అవసరం లేకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తాము అధికారంలోకి వస్తే మాత్రమే.. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. అధికారం కూటమికి దక్కితే గనుక.. ఇతర భాగస్వామ్య పక్షాలను కూడా సంప్రదించాలి గనుక.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాం. ఈసారి మేమే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి వస్తే.. అప్పుడు తప్పకుండా అన్నీ నెరవేరుస్తాం అని బుకాయించడానికి వీలుగా ఈ మాటలు మాట్లాడుతున్నారా? అనేది అర్థం కావడం లేదు.
సాధారణంగా ‘మేం అధికారంలోకి వస్తే’ అని చెప్పే మాటలు సగం అబద్ధాలే! ఇలాంటి వాళ్లంతా కాసిని సీట్లు గెలిచి.. ఇతర పార్టీలతో కలిసి జట్టు కట్టి అధికారం దక్కించుకుని.. ‘మాకు సింగిల్ గా అధికారం ఇవ్వలేదు కదా’ అని ప్రజలను వెక్కిరిస్తారు. రాహుల్ అలాంటి ఎత్తుగడే అనుసరిస్తున్నారో ఏమో తెలియదు.
రాహుల్ ఇంకో తలాతోకాలేని వాగ్దానం కూడా చేశారు. తాము అధికారంలోకి వస్తే.. జీఎస్టీలో స్లాబులను తొలగించి అన్నిటినీ ఒకే స్లాబు కిందికి తెస్తామని ప్రకటించారు. అసలు ఇది సాధ్యమేనా? ఆయన ఆలోచించే ఈ మాట చెప్పారా? జీఎస్టీలో ప్రస్తుతం 5 నుంచి 28 వరకు రకరకాల స్లాబులున్నాయి.
ప్రజల నిత్యావసరాలు 5 శాతం శ్లాబులో ఉంటే.. ఫైవ్ స్టార్ హోటల్ లు, ప్రెవేటు లాటరీలు లాంటి వ్యవహారాలన్నీ 28 శాతం శ్లాబులో ఉన్నాయి. వీటన్నింటినీ ఒకే శ్లాబుకిందికి తేవడం సాధ్యమని, తానుప్రధాని కావాలని కలగంటున్న ఈ నాయకుడు ఎలా ఊహిస్తున్నారో అర్థం కావడం లేదు. అన్నింటినీ 5 శాతం శ్లాబులోకి తెస్తే ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి.
అలాకాకుండా మరే ఇతర నిర్ణయం తీసుకున్నా.. సామాన్యుడికి జీవించడమే దుర్భరంగా మారిపోతుంది. వారి శాపాలను రాహుల్ పొందవలసి ఉంటుంది. ఆయన ఇవన్నీ ఆలోచించే.. జీఎస్టీలో ఒకే స్లాబుకిందికి తెస్తాం అని అన్నారా? ఏమో మరి!