తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్పుపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యంగా లేదని మెజార్టీ భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకూ ప్రతి రోజూ ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్య బ్రేక్ దర్శనాలు మొదలవుతున్నాయి. ఈ సమయాన్ని డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మార్పు చేస్తున్నారు.
ఇందులో భాగంగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఉదయం 8 గంటల నుంచి బ్రేక్ దర్శనాలు మొదలవుతాయి. ఆ తర్వాత ఉదయం 11 నుంచి 11.30 గంటలకంతా దర్శనాలు పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. బ్రేక్ దర్శనాల సమయం మార్పుతో తిరుమలలో విసతి గదులపై ఒత్తిడి తగ్గుతుందని ఆయన చెబుతున్నారు. కానీ ఆయన అభిప్రాయంతో భక్తులు ఏకీభవించడం లేదు.
ఉదయం 10 గంటలకు బ్రేక్ దర్శనాలు మొదలైతే తిరుపతి నుంచి చేరుకునే అవకాశం వుండేదంటున్నారు. బ్రేక్ దర్శన సమయానికి గంట ముందుగా చేరుకోవాల్సి రావడంతో , మార్చిన సమయం, అంతకు ముందున్న దానికి పెద్దగా తేడా లేదని భక్తులు చెబుతున్నారు. దీనివల్ల మళ్లీ తిరుమలలోనే రూమ్ తీసుకోవాల్సి వస్తుందని భక్తులు అంటున్నారు.
ఇది ప్రయోగాత్మకం అని చెబుతున్న నేపథ్యంలో, సమయ మార్పును పరిగణలోకి తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఉదయం 8 గంటలకు బ్రేక్ దర్శనాలను స్టార్ట్ చేయడం వల్ల టీటీడీ అధికారులు భావిస్తున్నట్టు తిరుమలలో వసతి గదులపై డిమాండ్ తగ్గదని భక్తులు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీన్ని టీటీడీ ఎలా తీసుకుంటుందో చూడాలి.